Transgender’s Heroine

ట్రాన్స్‌జెండర్ల హీరోయిన్‌

ఆమె చిన్నతనం నుండి ఒక పురుషుని వలె పెరిగింది.

మగ వాడిలా ప్రవర్తిస్తూ, పురుషుల దుస్తులే ధరించేది.

ఆమె మరెవరో కాదు, స్వీడన్ రాజు గుస్తావస్ అడాల్ఫస్ కుమార్తె అయిన క్వీన్ లేదా కింగ్ క్రిస్టినా.

ఆమె 1626లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని ట్రె క్రోనార్ కాజిల్‌లో జన్మించింది. ఆమె 1689 లో 62 సంవత్సరాల వయస్సులో మరణించినపుడు రోమ్‌లో ఖననం చేయబడింది.

తన సంతానంలో సజీవంగా వున్న ఏకైక బిడ్డ కావడంతో రాజు గుస్తావస్ తన తదనంతరం ఆమెకు రాజు (King) బిరుదుతో పట్టాభిషేకం చేయమని ఆదేశించాడు. కాబట్టి ఆమె స్వీడన్ యొక్క భవిష్యత్తు రాజుగా పెరిగింది. ఆమె మగవారిలా దుస్తులు ధరించేది మరియు తన అధికారాన్ని భార్య/భర్త తో పంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె యొక్క బహుముఖ ప్రజ్ఞ, విపరీత జీవనశైలి ఆమెను సమకాలీన లోకంలో ఏంతో సుపరిచితం చేసింది. ఆమె పేరు ఒక లెస్బియన్‌గా ప్రాచుర్యం పొందింది.

ఇప్పటికీ ఆమెను ‘హీరోయిన్ ఆఫ్ ది ట్రాన్స్‌జెండర్’గా వ్యవహరిస్తారు. ఆమెను ఒక విధంగా భిన్న లింగ సంపర్కురాలిగా చెప్పే అవకాశం కుడా లేక పోలేదు.

గ్రేటా గార్బో (Greta Garbo) హీరోయిన్ గా క్వీన్ క్రిస్టినా పై 1933 లో MGM వారి ప్రొడక్షన్ లో హాలివుడ్ లో ఒక సినిమా వచ్చింది.

ఆమె చిన్నతనం నుంచీ అన్ని విషయాలు బాగా నేర్చుకునేది. గొప్ప సంగ్రహణ శక్తి కలిగివుండేది.  ఆమె గొప్ప ఫ్రెంచ్ తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మరియు సైన్స్ మేధావి అయిన ‘రెనే డెస్కార్టెస్’ నుండి విద్య నేర్చుకోవడానికి ఆసక్తిని చూపించింది.

రెనే డెస్కార్టెస్ (1596-1650):

గణితంలో రెనే డెస్కార్టెస్ రెండు లేదా మూడు కోణాలలో ఒక పాయింట్‌ను గుర్తించడానికి కోఆర్డినేట్‌ల వినియోగాన్ని ప్రవేశపెట్టి అభివృద్ధి చేశాడు.

తత్వవేత్తగా, ఆయన – పరస్పర సంభందమున్నప్పటికీ మనస్సు మరియు పదార్థాలు రెండూ వేరయినవనే ద్వంద్వ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. దీని కోసం, ఆయన తన జ్ఞాన పునాదులను సుసంపన్నం మరియు మరింత సురక్షితం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన సిద్ధాంతం ప్రకారం, తన స్వంత చేతనా అనుభవం మరియు ఉనికి తప్ప మిగిలినవన్నీ సందేహాలకు తెర తీస్తాయని చెప్పాడు. ఆయన ఎల్లప్పుడూ “నేను అనుకున్న విధంగానే నేను ఉంటున్నాను” (కోగిటో, ఎర్గో సమ్) [“I think, therefore I am” (Cogito, ergo sum)] – అనే మాటలు ఎప్పుడూ చెప్పేవాడు.

ఈ సిద్ధాంతం క్వీన్/కింగ్ క్రిస్టినాపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఆమె తన రాజరిక జీవితంపై  శ్రద్ధను తగ్గించి తన కంటూ స్వతంత్ర గుర్తింపు వచ్చే భావజాలాన్ని అలవరచుకుంది. ఆమె పుట్టుకతో ప్రోటస్టెంట్ మతస్తురాలయినప్పటికీ క్యాథలిక్ మత సూత్రాల పట్ల ఆకర్షితులయ్యేలా బహుశా ఇది ఆమెను ప్రభావితం చేసి ఉండవచ్చు.

కింగ్ గుస్తావస్ అడాల్ఫస్ & స్వీడన్:

క్రిస్టినా తండ్రి కింగ్ గుస్తావస్ స్వీడన్‌ను శక్తివంతమైన యూరోపియన్ రాజ్యంగా మార్చాడు.

కింగ్ గుస్తావస్ అడాల్ఫస్ (1594-1632) పాలనలో స్వీడన్ 17వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో యూరోపియన్ శక్తిగా ఎదిగింది. అతను తన పాలన యొక్క మొదటి భాగంలో డెన్మార్క్, పోలాండ్ మరియు రష్యాలపై అనేక యుద్ధాలను గెలిచాడు. అతను తన దేశీయ సంస్కరణలతో స్వీడన్‌ను బలమైన మరియు ఆధునిక రాజ్యంగా మార్చాడు. అతను ప్రొటెస్టంట్ మతాన్ని అవలంబించాడు. 1630లో ‘ముప్పై సంవత్సరాల’ (Thirty Year’s War) యుద్ధంలో జోక్యం చేసుకుని ప్రొటెస్టంట్ రాజ్యాల తరపున పోరాడాడు.

ముప్పై ఏళ్ల యుద్ధం అంటే ఏమిటి?

ఐరోపాలో ముప్పై సంవత్సరాల యుద్ధం అనేది ప్రొటెస్టంట్లు మరియు కాథలిక్కుల మధ్య 1618 నుండి 1648 వరకు జరిగిన సంఘర్షణల శ్రేణి. యుద్ధం జర్మనీలో ప్రారంభమైంది. ఫ్రాన్స్, డెన్మార్క్ మరియు స్వీడన్ రాజ్యాలు పవిత్ర రోమన్ సామ్రాజ్యం మరియు స్పెయిన్‌లను వ్యతిరేకించే వరకు వ్యాపించింది. ఇది ఖండాంతర ఆధిపత్య పోరాటంగా అభివృద్ధి చెందింది. 1648 లో కుదిరిన శాంతి ఒప్పందం – ‘ట్రీటీ ఆఫ్ వెస్ట్‌ఫాలియా’ ద్వారా ఇది ముగిసింది.

ఈ యుద్ధంలో కింగ్ గుస్తావస్ అడాల్ఫస్ – హాప్స్‌బర్గ్‌ల కోసం పోరాడిన ఆస్ట్రియన్ జనరల్ వాలెన్‌స్టెయిన్ ఆధ్వర్యంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని ఓడించాడు.

హాప్స్‌బర్గ్స్ (హబ్స్‌బర్గ్స్) [Hapsburgs (Habsburgs)]:

మధ్యయుగం నుండి ఆధునిక కాలం వరకు మధ్య ఐరోపాలోని ప్రధాన రాజవంశాలలో హాప్స్‌బర్గ్‌లు ఒకరు. ప్రాథమికంగా వారు అనేక యూరోపియన్ రాష్ట్రాలకు పాలకులను అందించిన ఒక జర్మన్ రాజ కుటుంబం. ఆ రాజ వంశస్తులు 1440 నుండి 1806 వరకు పవిత్ర రోమన్ సామ్రాజ్యం యొక్క కిరీటాన్ని ధరించారు.

1632 లో, కింగ్ గుస్తావస్ అడాల్ఫస్ లుట్జెన్ (1594-1632) వద్ద జరిగిన యుద్ధంలో మరణించాడు.

స్వీడన్ రాజుగా క్రిస్టినా:

తండ్రి యుద్ధంలో మరణించిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు క్రిస్టినా స్వీడన్ రాజు అయింది.

గుస్తావస్ యొక్క తెలివైన ఛాన్సలర్, ఆక్సెల్ ఆక్సెన్స్టీమా, ఆమె కిరీటం వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసారు.

1651 తర్వాత, ఆమె యొక్క మతపరమైన ఆలోచనలు క్యాథలిక్ మతం వైపు మొగ్గు చూపడంతో రాజ్య పాలనపై ఆమె శ్రద్ధ తగ్గింది. దాని ఫలితంగా నిరసన పెరిగి రాజ్యానికి పాలకురాలిగా ఆమె స్థానం పట్ల అనిశ్చితికి దారి తీసింది. చివరకు ఆమె తన కొత్త మతం కోసం తన సింహాసనాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది.

ఆమె స్వీడన్‌ను విడిచిపెట్టి, తన శత్రువుల నుండి తనను రక్షించు కోవటం కోసం ‘కౌంట్ దోహ్నా’ (Count Dohna) అనే మారుపేరు ఎంచుకొంది. రోమ్ చేరుకున్న ఆమెకు పోప్ అలెగ్జాండర్ VII నుండి ఘన స్వాగతం లభించింది.

1654 డిసెంబర్ 24 న ఆమె క్యాథలిక్ మతంలోకి మారడం జరిగింది. ఆమె బాప్టిజం పొందిన పేరు కిస్టినా అగస్టా. దత్తత పేరు క్రిస్టినా అలెగ్జాండ్రా.

ఆమె యొక్క విపరీత జీవన శైలి ఆమెను దివాళా తీసింది. రోమ్ నుండి ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఆమె అక్కడ అస్థిరమైన, రెస్ట్ లెస్ జీవితాన్ని గడిపింది.

ఎట్టకేలకు స్వీడన్‌లోని తన ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇంటికి వెళుతుండగా, ప్రయాణం మధ్యలో ఆమె 1689లో హాంబర్గ్‌లో మరణించింది. ఆమె ఖననం వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగింది. ఆమె మరియు మరో ముగ్గురు మహిళలు మాత్రమే ఇప్పటివరకు ఇలాంటి గౌరవాన్ని పొందారు.

క్రిస్టినాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆమె 6000 కంటే ఎక్కువ పుస్తకాలతో అతి పెద్ద వ్యక్తిగత లైబ్రరీని నిర్వహించింది.

ఆమె మంచి రచయిత్రి. ఆమె మెదలెట్టిన తన ఆత్మకథ అసంపూర్తిగా మిగిలి పోయింది. ఆ పుస్తకంలో ఆమె తన హీరోలుగా అలెగ్జాండర్ ది గ్రేట్, సైరస్ ది గ్రేట్ మరియు జూలియస్ సీజర్ల గురించి ప్రస్తావించింది. ఆమె కళ మరియు సంగీతాలను ఎంతగానో ఇష్టపడింది.

చాలా మంది చరిత్రకారులు భావించినట్లు క్రిస్టినా నిజంగా ట్రాన్స్ జెండర్ కాదా?

ఇప్పటికీ ఆమె లైంగికతపై అనేక ప్రశ్నలు చర్చనీయాంశ మవుతున్నాయి. ఆమె రోమ్‌లో నివసిస్తున్నప్పుడు కార్డినల్ అజోలినోతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేది. ఇది అప్పట్లో  కొంత వివాదం కూడా సృష్టించింది.

దీనికి విరుద్ధంగా, కొంతమంది చరిత్రకారులు ఆమెను లెస్బియన్ గా వర్ణించారు. ఎందుకంటే ఆమెకు కొంతమంది సన్నిహిత మహిళా పరిచయస్తులతో కొన్ని ఉద్వేగభరితమైన సంబంధాలు కూడా వుండేవని ఆమె రాసిన ఉత్తరాల ద్వారా తెలుస్తోంది.

ఆమె భిన్న లింగ, లైంగికేతర, లెస్బియన్ లేదా ద్విలింగ సంబంధాలను కొనసాగించినట్లు కూడా వివరించబడింది. ఆమె ఏదీ సీరియెస్ గా తీసుకొనేది కాదు, కానీ అనేక కార్యకలాపాలలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేది.

క్రిస్టినా స్వయంగా తన ఆత్మకథలో తాను తన ద్విలింగ వ్యక్తిత్వంతో రమిస్తుంటానని పేర్కొంది.

ఆ పుస్తకంలో ఆమె తన గురించిన కొన్ని పదాలను కూడా జోడించింది. కొంతమంది తనపై ముద్ర వేసినట్లుగా తాను ‘పురుషుడిని కాదని అలాగే ‘హెర్మాఫ్రొడైట్ (Hermaphrodite – స్త్రీ పురుష లైంగిక లక్షణాలు మరియు అవయవాలు రెండింటినీ కలిగి ఉన్న వ్యక్తి )’ ని కూడా కాదని తేల్చి చెప్పింది.

Presented by:

Leave a Reply