Do we really have the ‘Third Eye’?

మనకు నిజంగానే ‘మూడవ కన్ను’ ఉందా?

Myth or Mystery? – నిజమా… లేక… కాల్పనికమా?

మన పూర్వీకులు మన మెదడులోని పీనియల్ గ్రంథి (pineal gland ) ని “మూడవ కన్ను” అని విశ్వసించేవారు.

ఆధ్యాత్మిక శక్తులను ఇంకా చెప్పాలంటే అతీంద్రియ సామర్థ్యాలను కలిగి ఉన్న దానిగా వారు ప్రగాడంగా ఆరాధించేవారు.

మెదడులోని పీనియల్ గ్రంథి యొక్క స్థానం:

(Location of the pineal gland in the brain):

ఇది మెదడు యొక్క మూడవ జఠరిక (third ventricle) నుండి క్రిందికి విస్తరించి ఉంటుంది. ఖచ్చితమైన స్థానం పిట్యూటరీ గ్రంధి పైభాగాన దానికి వెనుకగా ఉంటుంది.

రెనే డెస్కార్టెస్ (Rene Descartes) వంటి కొంతమంది తత్వవేత్తలు పీనియల్ గ్రంథిని మన ఆత్మకు ప్రవేశ (Entrance) మరియు నిష్క్రమణ (Exit) ద్వారం అని భావించారు.

రెనే డెస్కార్టెస్ క్రీ.శ. 1596 మరియు 1650 ల మధ్య జీవించిన ఫ్రెంచ్ తత్వవేత్త. ఆయన దీనిని బలంగా విశ్వసించారు.

ఆత్మ మన భౌతిక శరీరంలోకి ప్రవేశించటం అదేవిధంగా నిష్క్రమించటం ఈ పీనియల్ గ్రంధి ద్వారా జరుగుతుందని ఆయన చెప్పారు.

అందువలన ఆయన దానిని ‘మూడవ కన్ను’గా పేర్కొన్నాడు.

ఇది ఒక ఆధునిక గ్రాఫికల్ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా లాగా నిజంగా అద్భుతంగా వుంది కదా!

అనేక పురాణాలు కూడా ఆత్మకు మరణం లేదనే వాస్తవాన్ని ధృడంగా చెప్తున్నాయి.

శరీరం కేవలం వాహకం (carrier) మాత్రమే అని వివరిస్తున్నాయి.

ఆత్మ శరీరంలో వున్నంతవరకే మనం జీవించి ఉంటాము. ఆత్మశరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చనిపోవటం జరుగుతుంది.

కొన్ని పురాణాలు, ఇతిహాసాలలో ఈ మూడవ కన్ను ప్రస్తావన వుంది.

హిందూ పురాణాలలో శివుడు, దుర్గా మాత, అలాగే గ్రీకు ఇతిహాసాలలో అపోలోతో సంబంధం ఉన్న రావెన్స్ (ravens) (కాకులు) వంటి పౌరాణిక జీవులు మూడవ కన్ను కలిగి వుండటం మనం చూడొచ్చు.

  • శివుని మూడవ కన్నును “శక్తి మరియు విధ్వంసానికి” చిహ్నంగా నమ్ముతారు.
  • దుర్గాదేవి (‘త్రినయిని దుర్గ’ అనగా మూడు కన్నుల దుర్గ) యొక్క మూడవ కన్ను  “అగ్ని మరియు జ్ఞానాన్ని” సూచిస్తుంది.
  • మూడవకన్నుతో ఉన్న రావెన్ (కాకి) “సర్వం చూసే అంటే గతం, వర్తమానం మరియు భవిష్యత్తులను చూడగలదని” చెప్పబడింది.
  • అదే విధంగా, హిందూ మరియు బౌద్ధమతాల ప్రకారం, మూడవ కన్ను “ధ్యానం (meditation) ద్వారా పొందే జ్ఞానోదయాన్ని (enlightenment)” సూచిస్తుంది. ఈ మూడవ కన్ను కనుబొమ్మల పైన నుదిటి మధ్యలో ఉంటుంది.

ఇక ఇప్పుడు, ‘పీనియల్ గ్రంథి’ గురించిన కొన్ని వైద్యపరమైన వాస్తవాలను తెలుసుకుందాం.

పీనియల్ గ్రంథి గురించి వైద్యపరమైన వాస్తవాలు:

(Some medical facts about the pineal gland):

పీనియల్ గ్రంధి న్యూరాన్లతో కూడిన కొన్ని భాగాలను కలిగి ఉంటుంది. అయితే దీనికి మెదడుతో నేరుగా నాడీ పరమైన సంబంధం లేదు.

చాలా ఆసక్తికరమైన విషయం కదా!

న్యూరాన్లు కలిగి ఉండి, మెదడుతో నేరుగా కనెక్ట్ కాకపోవడం, అది కాస్త సూపర్ నేచురల్ గా అనిపిస్తోంది కదా! అయితే, అది నిజంగా దేనితో అనుసంధానించబడి ఉంది – లేదా – అది నిజంగా ఏమి చేస్తుందో… చూద్దాం!

  • ఇది ఎండోక్రైన్ వ్యవస్థ (endocrine system) కు చెందినదని సైన్స్ చెబుతోంది.

ఇది ప్రధానంగా కమ్యూనికేషన్ హబ్‌గా పనిచేస్తుంది.

మన శరీరంలో కమ్యూనికేషన్‌ పనిని చేసే రెండు వ్యవస్థలు ఉన్నాయి.

1. నాడీ వ్యవస్థ (Nervous System)

2. ఎండోక్రైన్ వ్యవస్థ (Endocrine System)

నాడీ వ్యవస్థలో, శరీరంలో వున్న ఫైబర్ వంటి నరాల ద్వారా ప్రేరణలు ప్రయాణించి కమ్యూనికేషన్ జరుగుతుంది.

ఎండోక్రైన్ వ్యవస్థలో హార్మోన్ల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది.

హార్మోన్లు అంటే ఏమిటి?

హార్మోన్లనేవి రక్తప్రవాహంలో ప్రయాణించే రసాయనాలు. ఇవి నరాలకి ప్రేరణలను కలగ చేయటం అలాగే నరాల యొక్క ప్రేరణలను నియంత్రించటం చేస్తాయి.

ఎండోక్రైన్ వ్యవస్థలో వుండే అవయవాలను గ్రంధులు అంటారు.

అవేంటంటే:

హైపోథాలమస్ (hypothalamus), పిట్యూటరీ (pituitary), పూర్వ పిట్యూటరీ (anterior pituitary), పృష్ఠ పిట్యూటరీ (posterior pituitary), పీనియల్ (pineal), థైరాయిడ్ (thyroid), పారాథైరాయిడ్ (parathyroid), అడ్రినల్ (adrenal), ప్యాంక్రియాస్ (pancreas) మరియు సెక్స్ గ్రంథులు (అండాశయాలు మరియు వృషణాలు – ovaries and testes) వంటివి.

ఇప్పుడు “మూడో కన్ను”… అంటే పీనియల్ గ్రంధికి వద్దాం.

నిజానికి పీనియల్ గ్రంథి గురించి శాస్త్రవేత్తలకు యిప్పటి వరకూ తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి.

  • ఇది మెలటోనిన్‌ (melatonin) ను విడుదల చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ మెలటోనిన్, కాంతి మరియు చీకటికి ప్రతిస్పందిస్తుంది.

ఇది ఆ సమాచారాన్ని హార్మోన్ల ద్వారా శరీరంలోని మిగిలిన భాగాలకు చేరవేస్తుంది.

పీనియల్ గ్రంథి నుండి వచ్చే మెలటోనిన్ ఏ పని చేస్తుంది?

మెలటోనిన్ యొక్క పనితీరు ఇప్పటికీ పూర్తిగా, స్పష్టంగా తెలియదు.

ఈ మెలటోనిన్, ‘సర్కాడియన్ క్లాక్’ (జీవ గడియారం) అని పిలువబడే శరీరం యొక్క రోజువారీ జీవ లయలను ప్రభావితం చేస్తుంది.

మన రోజువారి నిద్ర లేదా మెలకువగా ఉండుట, అలాగే మన శరీరంలోని పునరుత్పత్తి వ్యవస్థ లాంటివి రాత్రి లేదా పగలు వంటి కాలచక్రాల ద్వారా నియంత్రించబడేలా ఇది చూసుకుంటుంది.

మెలటోనిన్ యొక్క ఉత్పత్తి/సాంద్రత రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. ఇది పగటిపూట దాదాపుగా గుర్తించలేనంత స్థాయికి పడిపోతుంది.

నేడు, మెలటోనిన్‌ను జెట్‌లాగ్ (jetlag) నుండి నిద్రలేమి (insomnia) వరకు అన్నింటికీ చికిత్స చేయడానికి ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

కాబట్టి పీనియల్ గ్రంథి అనేది నిజంగా, ఫిలాసాఫర్ ‘రెనే డెస్కార్టెస్’ (Rene Descartes) చెప్పినట్లుగా ఆత్మ యొక్క ప్రవేశ/నిష్క్రమణ ద్వారం లాంటి మూడవ కన్నా? – లేదా – మన పూర్వీకులు భావించినట్లుగా అతీంద్రియ శక్తిలు గల ‘మూడవ కన్నా’? –  లేదా – సైన్స్ (ఇప్పటి వరకూ) చెప్తున్నట్లుగా మన శరీరంలోని ‘సర్కాడియన్ క్లాక్’లో భాగమా?

భవిష్యత్తు మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు.

ఈ బుల్లి పినియాల్ గ్లాండ్ పాత్ర కేవలం పగలు రాత్రులకే పరిమితమా? లేక అదొక అద్భుతమా?  చూద్దాం ఏమవుతుందో!

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply