The First-Ever Known Poet in the World History

మానవ చరిత్రలో మొట్ట మొదటి రచయిత లేదా కవి ఎవరో తెలుసా?

ప్రపంచ మొట్ట మొదటి రచయిత ఒక మహిళ…. ఈ మాట వినటానికి చాలా ఆశ్చర్యంగా వుంది.

పైగా ఆ నాటి  పురుషాదిక్య ప్రపంచంలో ఇది సాధ్యమా అని కూడా అనిపిస్తుంది.

కానీ, ఇప్పటి వరకూ దొరికిన అతెంటిక్ చారిత్రిక ఆధారాల ప్రకారం ఇది నిజం.

ఇంకా చెప్పాలంటే, ఆమె గురించి తెలుసుకునే కొలదీ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది.

ఆ స్త్రీ ఎవరో కాదు – సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రపంచలోనే మొట్ట మొదటి చక్రవర్తిగా చరిత్ర కారులచే అభివర్ణించ బడ్డ ఒక మహా సామ్రాజ్యాధినేత గారాల పట్టి.

రాకుమారి – ఎన్హేడువానా.

Enheduanna.

The Princess – The Priest.

  • రాకుమారి – పూజారిని

ఎన్హేడువానా (ఎన్హేడువన్నా) ప్రపంచంలోని రికార్డెడ్ చరిత్ర పుటలలో మొట్టమొదటి రచయిత (రచయిత్రి); కవి (poet) గా చాలా ప్రసిద్ది గాంచింది.

ఆమె క్రీస్తుపూర్వం 23వ శతాబ్దంలో అంటే సుమారు 2285 BC – 2250 BC సంవత్సరాల మధ్య కాలంలో వెళ్లి విరిసిన పురాతన మెసొపొటేమియా నాగరికతకు చెందిన రాకుమారి.

మెసొపొటేమియా (Mesopotamia) అనేది గ్రీకు పదం; అంటే ‘రెండు నదుల మధ్య (వున్న భూమి)’ అని అర్థం.

ఇది టైగ్రిస్ (Tigris) మరియు యూఫ్రేటిస్ (Euphrates) నదుల మధ్య ఉన్న భూమి. ఆ రోజుల్లో అనేక పురాతన నాగరికతలకి నిలయమైన నేల.

ఇది ఇప్పుడు పశ్చిమ ఆసియా అనగా చాలా వరకూ నేటి ఇరాక్, కువైట్ మరియు సిరియా యొక్క తూర్పు భాగాలు, ఆగ్నేయ టర్కీ మరియు టర్కిష్-సిరియన్ మరియు ఇరాన్-ఇరాక్ సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాలకు చెందిన భూమి.

ఎన్హేడువానా యొక్క మహోన్నత వ్యక్తిత్వం అర్థం కావాలంటే ఆ నాటి మెసపొటేమియా యొక్క సంస్కృతి అప్పటి స్థితిగతుల గురించి కొంచెం తెలుసుకోవాలి.

ఆ రోజుల్లో మెసొపొటేమియా నాగరికత అనేది సుమేరియన్లు, అక్కాడియన్లు, అస్సిరియన్లు మరియు  బాబిలోనియన్లు పాలించిన రాజ్యాలను సూచిస్తుంది.

సుమేరియన్లు అంటే సూమర్ ప్రాంతంలో నివసించిన ప్రజలు. ఇది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి నాగరికత అని చెప్పవచ్చు.

ఆ తర్వాత అక్కాడియన్లు క్రీ.పూ. 2900 నుండి 2350 వరకు మెసొపొటేమియా యొక్క మొదటి పురాతన సామ్రాజ్యాన్ని (the first ancient empire of Mesopotamia ని) నిర్మించారు.

ఆ తదనంతరం దీర్ఘకాల సుమేరియన్ నాగరికతలో, అక్కాడియన్ మరియు సుమేరియన్ భాషలు మాట్లాడే వారంతా ఒక రాజ్యం క్రింద ఏకమయ్యారు.

క్రీ.పూ. దాదాపు 25వ శతాబ్దంలో అసిరియన్లు కూడా మధ్యప్రాచ్యంలో మెసొపొటేమియా జాతి సమూహంగా ఉండే వారు.

బాబిలోనియన్లు పురాతన అక్కాడియన్ భాష మాట్లాడే మధ్య దక్షిణ మెసొపొటేమియా ప్రజలు. వీరు క్రీ.పూ. 1894 లో ఉద్భవించారు.

ఎన్హేడువన్నా సుప్రసిద్ధ అక్కాడియన్ చక్రవర్తి – “సర్గోన్ ది గ్రేట్” కుమార్తె. ఆమె తల్లి క్వీన్ తష్లుల్తమ్ (అయి ఉండవచ్చని అంటారు).

రికార్డు కాబడిన చరిత్ర ప్రకారం, సర్గాన్ చక్రవర్తి అక్కాడియన్ సామ్రాజ్యం యొక్క మొదటి పాలకుడిగా చెప్పబడ్డాడు.  ఇంకా చెప్పాలంటే చరిత్రలో ఒక మహా సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి చక్రవర్తి అని చెప్పవచ్చు.

అతను క్రీస్తుపూర్వం 24 నుండి 23వ శతాబ్దాలలో తన ఆక్రమణలతో సుమేరియన్ నగర రాష్ట్రాలతో కూడిన విస్తారమైన అక్కాడియన్ రాజ్యాన్ని స్థాపించాడు.

అతని పాలనలో ఉత్తర మరియు దక్షిణ మెసొపొటేమియాలు ఏకమై, చరిత్రలో ‘అక్కాడ్ నగరం’ ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలలో ఒకటిగా రూపు దిద్దుకుంది.

ఉర్ వద్ద ఉన్న గిపారు ప్రధాన నివాసంగా ఎన్హేడుఅన్నా జీవించింది.

ఆమె తన తండ్రి సర్గోన్ చక్రవర్తిచే యివ్వబడిన “ఎన్” (EN) బిరుదును కలిగిన మొట్టమొదటి మహిళ.

తరచుగా మెసొపొటేమియా నాగరికతలో రాజ కుమార్తెలకు గొప్ప రాజకీయ ప్రాముఖ్యత గల ‘ఎన్’ అనే బిరుదు ఇవ్వబడేది.

ఆమె తండ్రి సర్గోన్ చక్రవర్తి, ఆమెకు మరో పదవి కూడా ఇచ్చాడు. అదేంటంటే ‘ఉర్’ నగరంలో ‘ఇనాన్నా దేవత’ (goddess Inanna)  మరియు ‘చంద్ర దేవుడు’ నాన్నా (moon god  Nanna-Suen) ల ముఖ్య అలయాలకు  ప్రధాన పూజారి పదవి. ఉర్ నగరం నేటి ఆధునిక దక్షిణ ఇరాక్‌లో వున్నది.

‘నన్నా-సుయెన్’ మెసొపొటేమియా నాగరికతలో ‘చంద్ర దేవుడు’.

చంద్రుడిని సుమేరియన్లు నాన్నా (Nanna) అని, అక్కాడియన్లు సుయెన్ లేదా సిన్ (Suen or Sin) అని పిలుస్తారు.

ఎన్హేడుఅన్నా అంటే “స్వర్గాభరణం” అని అర్థం. ఇది దివ్య లోకానికి చెందిన ప్రధాన పూజారిగా ఆమె వృత్తి యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రాచీన ప్రపంచంలో లేఖక లేదా రచనా రంగాలలో పురుషుల ఆధిపత్యం కొనసాగేది.

కానీ, గొప్ప సాహిత్య చరిత్రగల మెసొపొటేమియా నాగరికతలో మహిళ అయినప్పటికీ ఆమె రచనలు ఒక ముఖ్యమైన భాగ మయ్యాయి.

ఆమె అనేక శ్లోకాలు మరియు పురాణాలను కంపోజ్ చేసింది.

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఎలక్ట్రానిక్ టెక్స్ట్ కార్పస్ ఆఫ్ సుమేరియన్ లిటరేచర్ (Electronic Text Corpus of Sumerian Literature – ETCSL) లో ఆమె రచనలు చాలా వరకు అనువాద రూపంలో అందుబాటులో ఉన్నాయి.

సుమేర్ మరియు అక్కాడ్ సామ్రాజ్యాలలోని దేవాలయాలను ఉద్దేశించి ఎన్హేడువన్నా 42 కీర్తనలను రచించింది. ఈ సంపుటిని ‘ది సుమేరియన్ టెంపుల్ హిమ్స్’ (‘The Sumerian Temple Hymns’) అని పిలుస్తారు.

వాటిలో ముఖ్యమైనది ఇనాన్నా దేవత గురించి ఆమె రచించిన ‘ది ఎక్సాల్టేషన్ ఆఫ్ ఇన్నా (The Exaltation of Inanna)’ లేదా ‘నిన్-మే-సర్-రా (Nin-me-sar-ra)’.

మిన్నెసోటా రచయిత్రి “కాస్ డాల్గ్లిష్ (Cass Dalglish)” రాసిన దీని “సమకాలీన కవితా అనుసరణ”  (contemporary poetic adaptation) 2008లో ప్రచురించబడింది.

ఆమె తన రచనలను ఇనాన్నా దేవతకు అంకితం చేసింది.

ఇనాన్నా దేవత అంటే మెసొపొటేమియా పురాణాలలో చంద్ర దేవుడైన నాన్న కుమార్తె.

పురాతన మెసొపొటేమియన్ దేవత అయిన ఇనాన్నా – ‘ప్రేమ, అందం, శృంగారం, యుద్ధం, న్యాయం మరియు రాజకీయ శక్తి’ తదితర వాటికి ప్రతీకగా ఆరాదించబడిన దేవత.

సుమేరియన్లు శక్తి మరియు అదృష్ట సౌభాగ్యాలను పొందడానికై ఆమెను పూజించేవారు.

ఈ దేవత ‘ఇష్తార్’ (Ishtar) అనే మరో పేరుతొ అక్కాడియన్లు, బాబిలోనియన్లు మరియు అస్సిరియన్లచె కీర్తించబడేది.

ఆమె తన గ్రంథం ‘ఇనాన్నా యొక్క ఔన్నత్యం’ లో తన సోదరుడు మరియు తండ్రి తదనంతర పాలకుడైన ‘రిముష్’ తనను ఉర్ నగరం నుండి బహిష్కరించడాన్ని గురించిన కథనాన్ని కూడా వివరించింది. అప్పట్లో జరిగిన ఒక రాజకీయ అలజడి (కుట్ర) లో ఆమె పాత్ర వున్నట్లు రాజైన రిముష్ ఆమెను అనుమానించాడం వల్ల అలా జరిగిందని ఆమె వివరించింది.

చివరకు ఆమె నిజవర్తనని తెలుసికున్న సోదరుడు తిరిగి ఆమెను ఆ పదవిలో నియమించాడు.

ఆమె కీర్తనలు మరియు పురాణాలు క్యూనిఫారం (cuneiform) లో వ్రాయబడ్డాయి.

క్యూనిఫారమ్ అనేది మట్టి పలకలను ఉపయోగించి వ్రాసే పురాతన రచనా రూపం.

ఉర్‌ లోని రాయల్ స్మశానవాటిక (Royal Cemetery) లో జరిపిన త్రవ్వకాలలో ఆమె పేరును కలిగివున్న రెండు ముద్రలు (seals) లభించాయి. అవి సార్గోనిక్ కాలం నాటి ఆమె సేవకులకు చెందినవని పురావస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు.

ఉర్ వద్ద గల గిపారు త్రవ్వకాలలో ఆమె పేరు మరియు పోలికలను కలిగి ఉన్న ఒక ‘అలబాస్టర్ డిస్క్’ (సున్నపు రాతి లాంటి దానిపై చెక్కబడిన చిన్న విగ్రహం) కూడా దొరికింది.

ఆమె రచనలలోని వాస్తవికత మరియు శైలి ఆమె ఆలయ శ్లోకాల (temple hymns) ద్వారా స్పష్టంగా తెలుసుకొవచ్చు.

ఆ కీర్తనలలో ఎన్హేడుఅన్నా ఇలా పేర్కొంది:

“ఓ నా ప్రభువా! ఇంతకు ముందు ఎవరూ సృష్టించనిది ఇప్పుడు సృష్టించబడింది”.

ఆమె సృజనాత్మక రచనా ప్రక్రియలో తలెత్తే రైటర్స్ బ్లాక్ (writer’s block) లాంటి ఇబ్బందులపై కూడా స్పష్టంగా  వ్యాఖ్యానించింది.

ఆమె రచనలు అనేక జీవిత చారిత్రకాంశాల సమ్మిళితమైన లక్షణాలను కలిగి ఉన్న అంశాలతో లోతైన,  వ్యక్తిగతమైన విషయాలను వెల్లడిస్తున్నాయి.

తను రాసిన కంపోజిషన్లను పగటిపూట ప్రదర్శించడం కోసం రాత్రిపూట ఎక్కువ సమయం వెచ్చించ వలసి వచ్చిందని ఆమె వివరించింది.

ఎన్హెడువన్నా యొక్క కవిత్వం దైవిక ప్రేరణ కూడిన కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

కవిత్వం కాకుండా, ఎన్హేడువాన్నా జీవితానికి సంబంధించిన ఇతర మూలాధారాలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

వీటిలో ఆమె సేవకులకు చెందిన సిలిండర్ సీల్స్, ఆమె దైవ భక్తి, అంకితభావాలను తెలుపుతూ చెక్కబడిన అలబాస్టర్ రిలీఫ్ ఉన్నాయి.

బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్త సర్ చార్లెస్ లియోనార్డ్ వూలీ (Sir Charles Leonard Woolley), అతని త్రవ్వక బృందం 1927లో ఎన్‌హెడువానా డిస్క్‌ను కనుగొన్నారు.

2014లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఇరాక్‌లోని ఎర్బిల్‌లో బ్రిటీష్ కౌన్సిల్ వారు నిర్వహించిన నినిటీ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ (Niniti International Literature Festival) యొక్క ప్రారంభ ఈవెంట్‌లో  ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రైటర్ మరియు గొప్ప స్త్రీ మూర్తిగా గణనీయమైన గౌరవాన్ని అందుకొంది.

ఆక్స్‌ఫర్డ్ ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్, ఎలియనోర్ రాబ్సన్ (Eleanor Robson) ఎన్‌హెడువాన్నాను “అద్భుత రూపం గల  సాకారమైన కోరికల ప్రతిబింబం” గా అభివర్ణించారు.

సైన్స్ టెలివిజన్ ధారావాహిక ‘కాస్మోస్ – ఎ స్పేస్‌ టైమ్ ఒడిస్సీ’ (Cosmos – A Space-time Odyssey) ఎపిసోడ్ లో ఎన్‌హెడువన్నాయే ప్రధాన పాత్ర. ఆమెకు క్రిస్టియన్ అమన్‌పూర్ (Christiane Amanpour) గాత్రదానం చేశారు.

ఆమె స్వర్గ లోకపు (ఆకాశంలోని) దేవతల గురించి వ్రాసిన కీర్తనలు ఆధునిక ఖగోళ శాస్త్ర రంగంలో ఎంతో గుర్తింపు పొందాయి.

ఆమె తన రచనలలో వివరించిన నక్షత్రాల కొలతలు, కదలికల వర్ణనలను మొట్ట మొదటి శాస్త్రీయ పరిశీలనలుగా  గౌరవిస్తూ 2015వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ (International Astronomical Union) మెర్క్యురీ గ్రహం (బుధ గ్రహం) పై కనుగొన్న ఒక బిలానికి (crater కి) ఎన్‌హెడువాన్నా పేరు పెట్టింది,.

మెర్క్యురీపై కనుగొన్న ఐదు కొత్త క్రేటర్లకు పేరు పెట్టడానికి నాసా (NASA) వారునిర్వహించిన పోటీలో ఒక క్రేటర్ కి  భారత అంతరిక్ష ఔత్సాహికుడు గగన్ టూర్ ఆమె పేరును సూచించి విజేతలలో ఒకరిగా నిలిచాడు.

(క్రేటర్ అంటే ఉల్క లేదా బాంబు వంటి వాటి ప్రభావంతో ఏర్పడే ఒక బిలం).

ఆమెను మొట్ట మొదటి రైటర్ లేదా పోయేట్, మరియు ప్రధాన పూజారిగా గుర్తించడంపై కొందరికి సందేహాలు ఉన్నప్పటికీ, చారిత్రక రికార్డులు మాత్రం ఎన్హేడువాన్నాను ప్రాచీన సాహిత్య రచనల స్వరకర్తగా స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆమె నిస్సందేహంగా ఆ నాటి సంప్రదాయాలు, నాగరీకత విశిష్టతలకి సంభందించిన కీలకాంశం అని చెప్పవచ్చు.

ఆమె మరణించి వేల సంవత్సరాలు అయినప్పటికీ ఎన్హేడువన్నా చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా కొనియాడ బడుతోంది.

ఒక విధంగా చెప్పాలంటే దేవతా మూర్తి గా పూజించ బడుతోందని చెప్పవచ్చు.

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply