మన ఎముకలు మనమేంటో తెలిపే కథను చెప్తాయి.
మన శరీరంలోని ఎముకల అమరిక ఒక అద్భుతమైన, శాస్త్రీయమైన ఇంజనీరింగ్ పనితనపు నిర్మాణ కౌశలానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
బేసిక్ గా ఎముకలు నిర్వహించే విధులు – ఉపయోగాలు:
- ఎముకలు మన శరీరాన్ని స్థిరంగా నిటారుగా ఉంచుతాయి.
- (అదే సమయంలో) అవి మన శరీరం సులువుగా అటూ యిటూ కదిలే స్వేచ్ఛను యిస్తాయి.
- అవి మన అంతర్గత అవయవాలను రక్షించేంత బలంగా ఉంటాయి.
- ముఖ్యంగా అవి రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.
- అవి మన శరీరానికి అవసరమైన ఖనిజాలను (minerals) నిల్వ చేసి నియంత్రిస్తాయి.
నిజంగా, మన ఎముకలు మనం ఎలా ఏర్పడ్డామో తెలిపే గత చరిత్ర – వినడానికి చాలా ఆసక్తిగా వుంటుంది.
ఎముకల అధ్యయనం – హోమో సేపియన్స్ (మానవ జాతి) యొక్క పరిణామం, చరిత్ర మరియు సంస్కృతి యొక్క మూలాలకి చెందిన డేటాను చక్కగా వివరిస్తుంది.
ఎముకల నుండి ఎంతో విలువైన సమాచారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు మరియు ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తుంటారు.
పర్యావరణానికి అనుకూలంగా మానవుల శరీరం కాలక్రమేణా తనను తాను ఎలా అభివృద్ధి చేసుకుందన్న విషయాన్ని మన ఎముకలు చక్కగా వివరిస్తాయి.
ఎముకలు మన శరీరంలా కుళ్లిపోవు; ఆ లక్షణం వల్లనే ఈ విషయాలన్నీ తెలుసుకోవటం సాధ్యమైంది.
మన ఎముకలు చెప్తున్న ఈ కథ (మానవ చరిత్ర) మానవ పరిణామం గురించి విస్తృత చిత్రాన్ని ఇస్తుంది:
- అవి శిలాజ మనిషి (fossil man) కి సంబంధించిన ఆధారాలను అందిస్తాయి.
- అవి ఆది కాలంలో మానవ జాతి వర్గీకరణకు ఆధారంగా నిలుస్తాయి.
- అవి మన ప్రాచీన సంస్కృతి మరియు తెగల గురించి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తాయి.
- అవి పురాతన కాలంలో సంభవించిన వ్యాధులు, మరణాలకి గల కారణాలను తెలియ జేస్తాయి.
- నేర పరిశోధనా డిటెక్టివ్లకు సాక్ష్యాలను అందించడం ద్వారా (ఫోరెన్సిక్) నేరాలను పరిష్కరించడానికి అవి అనేక విధాలుగా సహాయ పడతాయి.
శిలాజ ఎముక (Fossil bones) లు మనకు మానవ ముఖం యొక్క పరిణామం, అభివృద్ధిల గురించి విస్తృత రూపురేఖలను యిస్తాయి.
వివిధ కాలాలలో నివసించిన జాతులను ఎముకల పరిశీలనతో సుళువుగా పోల్చవచ్చు (నిర్ధారించవచ్చు).
ఉదాహరణకు:
దక్షిణ కోతి (Southern Ape) అని పిలువబడే 2 నుండి 3 మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న ఆస్ట్రాలోపిథెకస్ మానవున్ని (Australopithecus); 1,00,000 సంవత్సరాల క్రితం నాటి హోమో సేపియన్స్ (నియాండర్తల్ లేదా నియాండర్తల్ మ్యాన్) తో పోల్చటం వీలవుతున్నది.
ఈ శిలాజాల ద్వారా లభించే డేటా సహాయంతో మనం ఈ పూర్వీకులను 40,000 సంవత్సరాల క్రితం నాటి హోమో సేపియన్స్ అయిన మొదటి థింకింగ్ మ్యాన్ (మొదటి బుద్ధి జీవి) తో పోల్చవచ్చు.
కాలానుగుణంగా మనిషిలో వచ్చిన మార్పులు అనగా ముఖం చదునుగా, దంతాలు చిన్నగా, జంతువులా పొడుచుకొని వచ్చినట్లుండే గడ్డం ఇప్పటి మాదిరిగా స్క్వేర్ గా మారటం, బుద్దితో పాటు పెరిగిన మెదడు పరిమాణానికి అనుగుణంగా పెద్దదైన కపాలం (skull), తదితర మార్పులు ఈ పరిశీలనల ద్వారా నిర్ధారించబడ్డాయి.
All Blogs & Vlogs from mamlabs.net