Founder of Bangalore

కెంపే గౌడ

బెంగళూరు నగర స్థాపకుడు

ఆధునిక మెట్రోపాలిటన్ నగరం బెంగళూరును 1537లో ఒకటవ కెంపె గౌడ  నిర్మించారు.

కెంపె గౌడ ఆ కొత్త పట్టణాన్ని “గండు భూమి” (“వీరుల భూమి”) అని కూడా పేర్కొన్నాడు.

ఆ రోజుల్లో సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో నీరు, వ్యవసాయం, వాణిజ్యం మరియు రక్షణ వంటి అన్ని ప్రాథమిక మరియు అవసరమైన వసతులతో రాజధాని నగరాన్ని నిర్మించడం నిజంగా గొప్ప పాలకుడైన – కెంపె గౌడ – యొక్క అధ్బుత దూరదృష్టికి నిదర్శనం. ఆయన కల ప్రస్తుత బెంగళూరు రూపంలో సాకారమైంది.

ఆయన కోరుకున్నట్లుగా, కెంపె గౌడ యొక్క బెంగుళూరు ఇప్పుడు బహుముఖంగా విస్తరించి  నేటి భారతదేశంలో ఆధునిక మహానగరంగా వికసించింది.

ఇది ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక రాజధాని.

నేడు బెంగళూరు అనేక బిరుదులను సొంతం చేసుకుంది.

అవేంటంటే-

(పెద్ద సంఖ్యలో చెట్లు, పచ్చదనం కారణంగా) గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా,

(పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీల కారణంగా) సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా,

ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా,

భారత ఐటీ రాజధాని,

సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా,

స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా – మొదలైనవి.

కెంపేగౌడ 511వ జయంతిని పురస్కరించుకుని 2020 జూన్ 27 న, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 108 అడుగుల కెంపేగౌడ విగ్రహం మరియు విగ్రహం చుట్టూ 23 ఎకరాల సెంట్రల్ పార్క్ నిర్మించడానికి భూమి పూజ నిర్వహించారు.

కెంపేగౌడ జయంతి వేడుకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కర్ణాటక అంతటా 2017 జూన్ 27 నుండి నిర్వహిస్తూన్నది. దీనిని కెంపేగౌడ దినోత్సవం లేదా “కెంపేగౌడ జయంతి”గా గౌరవిస్తారు.

కెంపె గౌడ వొక్కలిగ రాజవంశానికి చెందినవాడు.

ఒక్కలిగ వంశం విజయనగర సామ్రాజ్యంలో సుమారు ఆరు వందల సంవత్సరాలు (అంటే సుమారు 1200 నుండి 1793 వరకు) కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పాలించిన చరిత్రగల వంశం.

కెంపే గౌడ పూర్తి పేరు నాదప్రభు హిరియ కెంపె గౌడ.

ఆయన విజయనగర సామ్రాజ్యం యొక్క సామంత రాజు మరియు అధిపతి.

ఆయన 16వ శతాబ్దంలో కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు.

కెంపె గౌడ ఆ నాటి సమకాలీన ప్రభువులలో బాగా చదువుకున్న మరియు విజయవంతమైన పాలకులలో ఒకరు.

ఆయన గౌడరాజులలో అత్యంత ప్రసిద్ధి చెందినవాడు. అతను తన న్యాయమైన మరియు మానవీయ పరిపాలన ద్వారా, అనేక సామాజిక సంస్కరణలను అమలు చేయడం ద్వారా ప్రజలతో మమేకమైన స్నేహపూర్వక పాలకుడిగా పేరు పొందాడు.

కెంపే గౌడ ప్రస్తుత బెంగళూరులోని ఉత్తర శివారు ప్రాంతమైన యలహంక సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు.

ఆయన తండ్రి 70 సంవత్సరాల పాటు – యెలహంకనాడు (యెలహంక)ను పాలించిన కెంపెనంజే గౌడ.

కెంపే గౌడ క్రీస్తు శకం సుమారు 1513 లో తన తండ్రి తరువాత రాజ్యం చేపట్టి తను మరణించే వరకు అంటే 1569 వరకు అంటే దాదాపు 50 సంవత్సరాలు పాలించాడు.

బెంగుళూరులో దేవాలయాలు మరియు నీటి రిజర్వాయర్లను నిర్మించడంలో ఆయన చేసిన కృషి ఎంతో విశిష్ట మైనది.

చిన్నతనం నుండే కెంపె గౌడ నాయకత్వ పటిమను కనబరిచారు. హేసరఘట్ట సమీపంలోని అయివరుకందాపుర (ఐగొండాపుర) గ్రామంలో తొమ్మిదేళ్లు గురుకులంలో విద్యాభ్యాసం చేశారు.

తన మంత్రి వీరన్న మరియు సలహాదారు గిద్దెగౌడలతో కలిసి వేట కోసం వెళ్ళినపుడు ఆ ప్రాంతంలో ఒక కోట, సైనిక కంటోన్మెంట్, వాటర్ ట్యాంకులు, దేవాలయాలు, అన్ని వ్యాపారాలు మరియు వృత్తుల వారు నివసించడానికి అనువైన ఒక క్రొత్త నగరాన్ని నిర్మించాలని, అక్కడే వ్యాపారులకు ఉపాధి కల్పించాలి అనే ఆలోచన కెంపెగౌడకి కలిగిందని  చెబుతారు.

దానికి అవసరమైన అనుమతి కోసం ఆయన విజయనగర రాజులను సంప్రదించాడు.  ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం యొక్క దక్షిణ భాగంలో 1532 లో బెంగళూరు కోటకు పునాదులు వేశాడు.

ఆయన బెంగళూరు నగరాన్ని ఎనిమిది ప్రవేశ ద్వారాలతో, అనేక జలాశయాలతో, విస్తృత రహదారులతో నిర్మించాడు. నగర నివాసం అన్నిచోట్లకీ విస్తరించేలా చేశాడు. వాటినే ఇప్పుడు అవెన్యూ రోడ్, ఉల్సూర్, యలహంక, కేఆర్ మార్కెట్ మరియు మల్లేశ్వరం అని పిలుస్తారు.

క్రీస్తు శకం 1537లో బెంగళూరు కోట మరియు పట్టణాన్ని నిర్మించిన తర్వాత, కెంపే గౌడ తన రాజధానిని యలహంక నుండి కొత్త బెంగళూరు పీటానికి మార్చాడు.

కెంపే గౌడ హయాంలో పన్నుల వసూళ్లు ధర్మబద్ధంగా, న్యాయంగా జరిగేవి.

వ్యవసాయదారులు, వ్యాపారులు తమ వృత్తులు చేసుకునేందుకు నిర్భయ, ప్రశాంతమైన పని వాతావరణం ఆయన నెలల్పాడు. ఆయన లాల్‌బాగ్‌లో వున్న గ్రానైట్ కొండపై నిర్మించిన ఒక వాచ్‌టవర్ ఇప్పటికీ మనం చూడొచ్చు.

ఆయన అనేక ఆలయాలు నిర్మిచాడు. బసవన్నగుడి (బుల్ టెంపుల్), ఉల్సూర్ నందలి సోమేశ్వరాలయం మరియు గావి గంగాధరేశ్వరాలయాలు ప్రముఖమైనవి. ఇవన్నీ ఈనాటికీ సజీవంగా ఉన్నాయి.

కెంపె గౌడ 1550 వ సంవత్సర ప్రారంభంలో పగోడాలు అని పిలిచే నాణేలను సొంతంగా ముద్రించాడు. అప్పటి వరకూ సామంత రాజులు విజయ నగర సామ్రాజ్య ముద్రిత నాణాలు మాత్రమే ఉపయోగించేవారు.

విజయనగర రాజులు కెంపే గౌడ యొక్క ఈ చర్యకు అసంతృప్తి చెంది అతనిని ఐదు సంవత్సరాలు జైలులో పెట్టారు.

శిక్షా కాలం తర్వాత విడుదలైన ఆయన తన భూభాగాలను తిరిగి పొందాడు.

అందుకు కృతజ్ఞతగా ఆయన శివసముద్రం ఆలయానికి వెళ్లే మెట్లను నిర్మించాడు.

అతను దయగల మరియు న్యాయమైన పాలకుడే కాకుండా, సంఘ సంస్కర్త కూడా.

అతను తన కాలంలో ప్రబలంగా ఉన్న అనేక చెడు సామాజిక ఆచారాలను నిషేధించాడు.

అతని ముఖ్య సామాజిక సంస్కరణల్లో ఒకటి, మొరాసు వొక్కలిగులు పాటించే ముఖ్యమైన “బండి దేవరు” అనే ఆచారాన్ని నిషేధించడం. ఈ ఆచారం ప్రకారం వివాహిత స్త్రీల ఎడమ చేతి చివరి రెండు వేళ్లు నరికివేయబడతాయి.

అతను కళలు మరియు జ్ఞాన సముపార్జనలపై అతనికున్న ప్రేమకు కూడా ప్రసిద్ధి చెందాడు.

తెలుగు భాషలో ఆయనే స్వయంగా యక్షగాన సంప్రదాయ రూపంలో ‘గంగా గౌరీ సల్లాపం’ (శివుని భార్యలైన గంగా మరియు గౌరీల మధ్య చర్చ) అనే నాటకాన్ని రచించారు.

కొన్ని సాహిత్య మూలాల ప్రకారం, బెంగళూరు కెంపె గౌడ యొక్క పెద్ద కుమారుడు గిద్దె గౌడ, అతని మరణానంతరం రాజ్య నియంత్రణను తీసుకున్నాడు.

కెంపె గౌడ వంశం మాగడిలో ఒక శతాబ్దం పాటు కొనసాగింది, అక్కడ వారు అనేక దేవాలయాలు, కోటలు మరియు ట్యాంకులు నిర్మించారు.

శివగంగలోని గంగాధరేశ్వర ఆలయంలో 1609లో మరణానంతరం కెంపె గౌడ యొక్క లోహ విగ్రహం స్థాపించబడింది.

2015 మార్చి 7 న మగడిలోని కెంపపురా గ్రామంలో చరిత్రకారుడిగా మారిన కళాశాల అధికారి ప్రశాంత్ మరూర్‌కి అనుకోకుండా కెంపె గౌడ సమాధి లభించింది.

ఈ సమాధిని కెంపేగౌడ యొక్క కుమారుడు ఇమ్మడి కెంపేగౌడ నిర్మించాడని చరిత్రకారుల బృందం తరువాత నిర్ధారించింది.

ఇదంతా ప్రశాంత్ మరూర్ 2015 సెప్టెంబర్ 3 న విహాయవాణి దినపత్రికలో రాశారు.

కెంపే గౌడకు గౌరవ సూచకంగా ప్రభుత్వం బెంగళూరులోని ఒక ప్రధాన రహదారికి కెంపె గౌడ రోడ్డు అని పేరు పెట్టింది.

1964 లో బెంగళూరులోని కార్పోరేషన్ సర్కిల్‌లో బెంగుళూరు వ్యవస్థాపకుడైన కెంపే గౌడ స్మారకార్థం ఒక మెటల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కెంపేగౌడ పేరు మీద ‘నాదప్రభు కెంపేగౌడ’ అనే పౌర పురస్కార అవార్డును ప్రతి సంవత్సరం BBMP (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) ద్వారా నిర్వహించే వేడుకలో విజేతలకి అందజేస్తారు.

2013 డిసెంబర్ 14 న బెంగళూరులోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చబడింది.

ఆయన గౌరవార్థం సెంట్రల్ బస్ టెర్మినల్ అంటే మెజెస్టిక్ బస్ స్టేషన్‌కి కెంపెగౌడ బస్ స్టేషన్ అని పేరు పెట్టారు.

బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ ఆయన గౌరవార్థం నాదప్రభు కెంపేగౌడ లేఅవుట్ మరియు పార్కును అభివృద్ధి చేసింది.

కెంపేగౌడ గౌరవార్థం ప్రముఖ మెజెస్టిక్ మెట్రో స్టేషన్ (నమ్మ మెట్రో) పేరు మార్చబడింది.

కెంపేగౌడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కెంపేగౌడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ, కెంపేగౌడ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు కెంపేగౌడ రెసిడెన్షియల్ పి.యు. కాలేజీ వంటి విద్యా సంస్థలకు కెంపేగౌడ పేరు పెట్టారు.

నాడప్రభు కెంపేగౌడ కన్వెన్షన్ సెంటర్ కూడా బెంగళూరులో ఉంది.

Presented by:

Leave a Reply