First Democracy/T

చరిత్రలో తొలి ప్రజాస్వామ్యం…

అది క్రీస్తు పూర్వం సుమారు 500 సంవత్సరాల నాటి కాలం…

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెల్లివిరిసిన ప్రజాస్వామ్యానికి పునాదిపడ్డ కాలం.

ఆనాడు గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరం – ప్రజలు మరియు ప్రభువుల మధ్య వర్గ విభేదాలు మరియు పోరాటాలతో సతమత మవుతోంది.

అప్పుడే ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సృష్టించిన క్లీస్టెనెస్ – గ్రీస్‌లో లోతుగా పాతుకుపోయిన భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా సామాజిక హక్కుల కోసం రహస్య ప్రవాసంలో వుండి అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్నాడు. అతని సంస్కరణలు సోలోన్ ప్రారంభించిన ప్రజాస్వామ్య ప్రక్రియను ఏకీకృతం చేశాయి, అంతేకాక అతని తదనంతర కాలం నాటి పెరిక్లీజ్ అవలంభించిన ప్రజాస్వామ్య విధానాలను అవి చాలా ప్రభావితం చేశాయి.

క్లీస్టెనెస్ (Cleisthenes or Clisthenes) క్రీ.పూ. సుమారు  570 మరియు 508 ల మధ్య నివసించాడు. ఆయన క్రీ.పూ. 525 మరియు 524 మధ్య కాలంలో గొప్ప రాజనీతిజ్ఞుడుగా పరిగణించ బడ్డాడు. అంతేకాక ఆయన ఏథెన్స్ యొక్క ప్రధాన ఆర్కాన్ (Archon) లలో ఒకరు.

పురాతన ఏథెన్స్‌లో తొమ్మిది మంది ప్రధాన న్యాయాధికారులు వుండేవారు. వారిని ఆర్కాన్లు అని పిలిచేవారు.

సోలోన్ (Solon) అంటే ఎవరు?

సోలోన్ (సుమారు క్రీ..పూ. 630 నుండి క్రీ.పూ. 560 మధ్య కాలం):

సోలోన్ ఎథీనియన్ రాజనీతిజ్ఞుడు, కవి, ఆర్థికవేత్త మరియు న్యాయనిర్ణేత. అతను గ్రీకుల యొక్క ఏడుగురు ఋషులలో ఒకడు. అతని చట్టపరమైన, రాజ్యాంగ మరియు ఆర్థిక సంస్కరణలు డ్రాకో చే స్థాపించబడిన ఆనాటి కఠిన చట్టాల నియమావళి యొక్క తీవ్రతను తగ్గించాయి.

మనిషి పుట్టుకను బట్టి కాకుండా, సంపద ఆధారంగా గ్రీకు పౌరులను నాలుగు తరగతులుగా విభజించాలని సోలోన్ ప్రతిపాదించాడు. ఎథీనియన్ ప్రజాస్వామ్యానికి పునాదులు ఆయనే వేసినట్లు పరిగణించవచ్చు.

ఏడుగురు ఋషులు (seven sages) అంటే ఎవరు?

ప్రాచీన గ్రీకు పురాణాలలో, థేల్స్, పిట్టాకోస్, సోలోన్, క్లియోవౌలోస్, పెరియాండ్రోస్ మరియు చిలోన్‌లను ఏడుగురు ఋషులుగా పరిగణించారు. వారు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకు పైగా పురాతన గ్రీకులో నివసించినట్లు చెబుతారు. వారు ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రానికి పునాది వేశారు. వారి తరువాత సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలైన వారితో గ్రీకు తత్వశాస్త్రం యొక్క నియోక్లాసికల్ యుగం ప్రారంభమైంది.

డ్రాకో (Draco) అంటే ఎవరు?

డ్రాకో క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో జీవించాడు. ఆయన ఎథీనియన్ శాసనసభ్యుడు (చట్టకర్త). ఆయన సృష్టించిన ఎథీనియన్ చట్ట క్రోడీకరణ (codification of Athenian law) అత్యంత కఠిన తరంగా వుండేది. ఆయన రూపకల్పన చేసిన న్యాయ శాస్త్రంలో శిక్షలు నేర తీవ్రతను బట్టి కాకుండా అతి అల్ప నేరాలకు కూడా (దాదాపు ప్రతి నేరానికి) మరణశిక్ష విధించేలా ఉండేవి.

పెరిక్లీజ్ (Pericles) అంటే ఎవరు?

పెరిక్లీజ్ సుమారు క్రీ.పూ. 495 మరియు 429 ల మధ్య నివసించాడు. ఆయన ఎథీనియన్ రాజనీతిజ్ఞుడు మరియు సైన్యాధికారి (జనరల్). ఆయన ఎథీనియన్ ప్రజాస్వామ్యానికి ఛాంపియన్‌గా పరిగణించబడ్డాడు. అతను సామ్రాజ్యవాద (imperialism) విధానాన్ని అనుసరించాడు. ఆయన పెలోపొన్నెసియన్ యుద్ధంలో ఎథీనియన్ వ్యూహానికి సూత్రధారిగా కీలక పాత్ర పోషించాడు. క్రీ.పూ. 447 లో పార్థినాన్ భవనాన్ని ప్రారంభించడం ద్వారా ఏథెన్స్ యొక్క సంస్కృతి మరింత అభివృద్ధి చెందేలా ఆయన ప్రోత్సహించాడు.

పెలోపొన్నెసియన్ యుద్ధం (Peloponnesian War):

ఇది క్రీ.పూ. 431 నుండి 404 వరకు ఏథెన్స్ మరియు స్పార్టా వారి మిత్రదేశాలకు మధ్య జరిగిన యుద్ధం.

స్పార్టా అనేది గ్రీస్‌లోని దక్షిణ పెలోపొన్నీస్‌లోని ప్రసిద్ధ పురాతన గ్రీకు నగరం. ఇది క్రీ.పూ. 5వ శతాబ్దంలో శక్తివంతమైన నగర రాజ్యం.

పార్థినాన్ (Parthenon):

పార్థినాన్ అంటే ఎథీనా పార్థినోస్ (పల్లాస్, రోమన్ సమానమైన మినర్వా) దేవత యొక్క ప్రధాన ఆలయం, దీని అర్థం ‘కన్య’. ఆ దేవతకు ఎథీనా, పల్లాస్ అనే పేర్లు కూడా కలవు. రోమన్ సంస్కృతిలో ఆమెను మినర్వా అంటారు. మన హిందూ దేవత అయిన సరస్వతీదేవి అనవచ్చు. ఆమె జ్ఞానం మరియు ఉపయోగకరమైన అనేక కళలు మరియు వివేకవంతమైన యుద్ధ దేవత. ఆమెను ఏథెన్స్ నగర సంరక్షకురాలిగా పరిగణించేవారు.

పెరిక్లీజ్ క్రీ.పూ. 447-432లో అక్రోపోలిస్‌ (Acropolis) లో పార్థినాన్‌ను నిర్మించాడు. ఇది ఏథెన్స్ యొక్క రక్షణ దేవత అయిన ఎథీనా యొక్క గౌరవార్థం మరియు పర్షియన్లపై గ్రీస్ సాధించిన విజయానికి  గుర్తుగా నిర్మించబడింది. గ్రీకు వాస్తుశిల్పులు ఇక్టినస్ (Ictinus) మరియు కాలిక్రేట్స్ (Callicrates) లు శిల్పి ఫిడియాస్ (Phidias) సహాయంతో ఈ ఆలయాన్ని రూపొందించారు.

ఈ విగ్రహం సుమారు 12 మీ (38 అడుగులు) ఎత్తు వుండేదని చెప్తారు. విగ్రహ నిర్మాణానికి టన్నుకు పైగా బంగారాన్ని వినియోగించారట. ఈ విగ్రహం ఒక సహస్రాబ్ది (1000 సంవత్సరాలు) కంటే ఎక్కువ కాలం నిలిచిందని చెబుతారు. 1990లో అదే రూపంలో ఎథీనా యొక్క కొత్త విగ్రహం టెన్నెస్సీ (Tennessee) లోని నాష్‌విల్లే (Nashville) లో ఏర్పాటు చేయబడింది.

అక్రోపోలిస్ (Acropolis):

ఇది ఏథెన్స్‌లోని పురాతన కోట. ఇది పార్థినాన్ మరియు ఇతర ప్రముఖ భవనాల నిలయ ప్రదేశం, ఇది సుమారుగా క్రీ.పూ. 5వ శతాబ్దం నాటిదని చెప్పవచ్చు.  

ప్రపంచ మొట్ట మొదటి ప్రజాస్వామ్యం ఎలా ఏర్పడింది?

తను ప్రవాసంలో ఉంటూ ఇతర ఎథీనియన్ ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా క్లీస్టెనెస్ యొక్క పోరాటం అనేక సంవత్సరాల పాటు కొనసాగింది.

సామాన్యుల మద్దతును కూడగట్టి ఎట్టకేలకు అధికారం దక్కించుకున్నాడు. తద్వారా చరిత్రలో మొట్టమొదటిసారిగా పేరెన్నికగన్న ప్రజాస్వామ్యానికి పునాది వేశాడు. ఆ తర్వాత సోలోన్ రూపొందించిన అత్యంత కఠిన చట్టాలను సంస్కరించేందుకు ప్రయత్నించాడు. ఏథెన్స్‌లోని వివిధ సంఘాల స్తితిగతులను సమతుల్యం చేయడానికి అతని యొక్క ప్రయత్నాలు ఫలవంతమై ఉత్తమ ఫలితాలను ఇచ్చాయి.

కుటుంబం/వంశ వ్యవస్థ నిషేధించబడింది:

క్లీస్టెనెస్ కుటుంబం మరియు వంశం ఆధారంగా గ్రీస్‌లో ఉన్న రాజకీయ వ్యవస్థను నిషేధించాలని భావించాడు. దానికి బదులుగా అతను గ్రామాలు లేదా డీమ్స్ (demes) నుండి పది తెగలుగా వర్గీకరించి ‘బౌల్’ (boule) అనే శాసన మండలిని ఏర్పాటు చేశాడు.

500 మంది ప్రజా ప్రతినిధులు గల శాసన మండలి ఏర్పడింది. ప్రజాప్రతినిధులు డీమ్స్ లేదా గ్రామాల మధ్య యివ్వబడిన కోటాల ప్రకారం పౌరులచే ఎన్నుకోబడతారు.

క్లీస్టెనెస్ ప్రజాస్వామ్యం, తరువాతి సంవత్సరాలలో, మూడు శాఖలుగా రూపాంతరం చెందింది.

1. ఎక్లేసియా: అసెంబ్లీ.

2. బౌల్: 500 మంది ప్రతినిధుల కౌన్సిల్.

3. డికాస్టెరియా: కోర్టులు.

ఎన్నికల ప్రక్రియ & అర్హత:

అభ్యర్థిగా పోటీ చేయడానికి కావలసిన అర్హత చాలా కఠినంగా ఉండేది. కౌన్సిల్‌లో కూడా ఎన్నుకోబడ్డ ప్రతినిధి యొక్క కాలవ్యవధి కోసం అతను కఠినమైన నియమాలను రూపొందించాడు. ఈ కఠిన పద్దతి న్యాయస్థాన విభాగాలు మరియు సైనిక వ్యవస్థకు కూడా వర్తించబడేలా ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించాడు.

ప్రజల భాగస్వామ్యానికి మార్గాలను విస్తృతం చేసే విధంగా క్లీస్టెనెస్ పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దీని కారణంగా ఆనాటి గ్రీకు వ్యవస్థలో నెలకొన్న వర్గ పోరులు, ఆధిపత్య పోరాటాలు మరియు గ్రూప్ రాజకీయాలను ఇది తగ్గించింది.

నియంతృత్వ పాలనకి ముగింపు:

కొత్త శాసన వ్యవస్థను అమలు చేయడం ద్వారా క్లీస్టెనెస్ నియంతల నిరంకుశ పాలనకు చరమ గీతం పాడాడు. తను ఏర్పాటు చేసిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను “ఐసోనోమియా” (Isonomia) అంటే “అందరికీ సమాన హక్కులు” అని పిలిచాడు. చాలా మంది చరిత్రకారులు ఈ వ్యవస్థను ప్రజాస్వామ్యానికి నాందిగా పరిగణిస్తారు. అయితే ఇది “ప్రజలచే పాలన” అనే నేటి ప్రజాస్వామ్యం యొక్క అర్థం నుండి కొంచెం వేరుగా వుందన్న మాట.

అతను సమూహాలు వర్గాలుగా విడదీయబడే రాజకీయాల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించ గాలిగాడు. తద్వారా గ్రీస్‌లో నియంతృత్వ పాలనకి ముగింపు పలికాడు.

ఏథెన్స్ యొక్క స్వర్ణయుగం (The Golden Age of Athens):

ఆయన ప్రధానంగా అందరికీ సమాన హక్కుల కోసం మొగ్గు చూపినప్పటికీ, అనేక విధాలుగా గ్రీకుల సాంప్రదాయ సంస్కృతిని చెక్కుచెదరకుండా ఉంచడానికి కూడా ప్రయత్నించాడు. తను ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ మరియు సంస్కరణల ద్వారా ప్రజాస్వామ్యం మరియు సంస్కృతి సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నాడు.

నిస్సందేహంగా, ఆయన ప్రజలందరినీ పరిపాలన మరియు అభివృద్ధిలలో  సమానంగా పాల్గొనేలా చేయడం ద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో విజయం సాధించాడు, ఇది చరిత్రలో ఏర్పడ్డ మొదటి ప్రజాస్వామ్యానికి నాందిగా చరిత్ర కారులచే పరిగణించబడింది.

క్లీస్టెనెస్ ను ప్రజాస్వామ్య పితామహుడిగా, ఏథెన్స్ నగరాన్ని (గ్రీస్ రాజధాని) ప్రజాస్వామ్య  జన్మస్థలంగా పరిగణిస్తారు.

Presented by:

Leave a Reply