అత్ర హాసిస్ – ది మిత్ & ది ఫ్యాక్ట్స్
డార్విన్ తదితర మానవ పరిణామ క్రమ సిద్ధతాలను ప్రక్కన పెట్టి, ఒకసారి ఆనాటి పూర్వికుల ద్వారా మానవాళికి సంక్రమించిన అనేక పురాణ గాథలను పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు ఇప్పటి సోషియో-ఫేంటసీ ఫిల్మ్స్ వలె అనిపిస్తాయి.
ఇవి నిజమా లేక పుక్కిటి పురాణాలా అనే డిస్కషన్ కి పోకుండా మన పూర్వీకులను అంటే మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఆ నాటి ప్రాచీన నాగరికతలలో చెప్పబడిన అనేక పురాణాలలో అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడిందో అనే విషయంపై ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్పబడింది.
“మిత్స్ అండ్ మిస్టరీస్” – అనే ఈ సిరీస్ ద్వారా ఇలాంటి అనేక పురాణ విశిష్టతలు, క్రొత్త క్రొత్త విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాం.
ఇక విషయానికొస్తే…..
అత్ర హాసిస్ అనేది క్రీ.పూ. 18-17 శతాబ్దాలలో మేసపోటామియా నాగరికతలో భాగంగా వికసించిన అక్కాడియాన్ల కాలంనాటి పురాణ గాథ.
ఇది మానవజాతి ఎలా సృష్టించ బడిందో వివరిస్తుంది.
ఇది దేవుళ్ళు, మానవ జాతిని ఎందుకు సృష్టించారనే దానిపై ఒక మంచి సమాచారాన్ని యిస్తుంది. అది ఇప్పటి హాలీవుడ్ సినిమాలలో ఎలియన్స్ కి చెందిన ఒక మంచి మూవీ స్క్రిప్ట్ ని పోలివుంటుంది.
అంతేకాకుండా, భూమిపై ఉన్న ఇతర జంతువుల కంటే మానవులకు ప్రత్యేక మేధస్సు ఎందుకు ఉందో అది చెప్తుంది.
కొంతమంది పండితులు అత్ర హసిస్ ఇతిహాసాన్ని బాబిలోనియన్ జెనెసిస్ తో పోల్చి చెప్తారు.
ఇది ఇంచు మించు గిల్‌గమేష్ ఇతిహాసంలోని గ్రేట్ ఫ్లడ్ (మహా ప్రళయం) మరియు జెనెసిస్ పుస్తకంలోని నోవా ఆర్క్ వంటి ఉప్పెనలను పోలిన కథ లాంటిదే.
ఇది ‘ఆది దేవతల మధ్య పగ ఎలా పుట్టింది, అది ఎలా పెరిగి పెద్దదయింది’ – వంటి అనేక కారణాల గురించి సవివరంగా చెబుతుంది.
అత్ర హసిస్ పురాణం ప్రకారం – ప్రధాన ఇతివృత్తం దేవుళ్ల మధ్య చీలికలు ఏర్పడటం, మానవుల సృష్టి – వీటి చుట్టూ తిరుగుతుంది.
ఈ పురాణం ప్రకారం, సృష్టి మొదట్లో ‘రెండు రకాల దేవుళ్ళు’ ఉండేవారు. మొదటి రకం దేవుళ్ళు సర్వ శక్తిమంతులు (సర్వోన్నత దేవుళ్ళు – ప్రధమ శ్రేణి దేవతలు) (Great Gods), రెండవ వారు ద్వితీయ శ్రేణి దేవతలు (Lesser Gods).
ప్రారంభంలో ద్వితీయ శ్రేణి దేవతలు సర్వోన్నత దేవతలకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వడం ద్వారా సేవ చేసేవారు. వారు ధరించే దుస్తులు అందించడం మరియు గృహ నిర్వహణ విధి లాంటివి కూడా తక్కువ దేవతల పనిగా వుండేది. ఇది దేవాలయాలలోని దేవతల విగ్రహాలకు సేవలు చేసే పూజారుల విధిని పోలి ఉంటుంది.
ఇలా గ్రేట్ గాడ్స్ కి అణిగి మణిగి వుండటం రెండవ తరగతి దేవతలకు నచ్చ లేదు. వారు చాలా ఆగ్రహావేశాలకి గురయ్యారు.
వారు సర్వోన్నత దేవతలను సేవించడానికి నిరాకరించారు.
కలహించిన ఆ దిగువ జాతి దేవతలు తమ పనులను నిర్వహించటం మానేశారు. ఈ పరిస్థితి సర్వోన్నత దేవతలు ఆకలి దప్పులతో అలమటించే స్థితికి దారి తీసింది.
వారు నిస్సహాయులుగా మారతారు.
అప్పుడు ‘ఎంకి’ అనే ఒక తెలివైన అగ్ర శ్రేణి దేవుడు (సృష్టి కర్త అయిన మన బ్రహ్మ దేవుడితో సమానం అన్నమాట) ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తాడు.
అతను దేవుళ్ళను సేవించడానికి ‘మానవులు’ అనే ఒక కొత్త జాతిని సృష్టిస్తాడు. తెలివిగా అతను మానవులను మట్టితో తయారు చేసి అమరత్వం లేకుండా చేస్తాడు. తద్వారా వారికి దైవ శక్తులు లేకుండా చేసి భవిష్యత్తులో వారు తమను తాము దేవుళ్లు లేదా దైవ ప్రతినిధులుగా చెప్పుకోలేని విధంగా చేస్తాడు. దేవతల మీద మానవులు భవిష్యత్తులో ఏ విధంగానూ తిరుగుబాటు చేయకుండా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటాడు.
ఈ విధంగా ఎంకి, ఇరు పక్షాల దేవతల మధ్య తలెత్తిన ఈ కలహాన్ని పెద్దది కాకుండా చక్కగా పరిష్కరిస్తాడు.
అతను దేవతలకు సేవకులుగా మానవులను సృష్టించటమే కాకుండా భవిష్యత్తులో మానవులు తాము దేవుళ్లమని చెప్పుకోకుండా తెలివిగా మానవ సృష్టి చేస్తాడు.
కానీ దేవతలను సేవించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని మానవులకు దైవిక తెలివితేటలను మాత్రం ఇచ్చాడు.
మనుషులకి దైవిక తెలివి తేటలు యివ్వడం కోసం ఎంకి దిగువ శ్రేణి దేవతలలో ఒకరిని బలి యిచ్చి వారి రక్తాన్ని మానవులలోకి చొప్పించాడన్న విషయం ఈ పురాణంలో చెప్పబడింది.
ఈ ఇతిహాసం – ఇతర జంతువులకు భిన్నంగా మనుషులు ఎందుకు ఎక్కువ మేధో సంపత్తిని కలిగి వున్నారనే విషయాన్ని – మనకు వివరిస్తుంది.
For the post in English – Click here
All Blogs & Vlogs from mamlabs.net