Alexander’s Secret Love/Telugu

అలెగ్జాండర్ రహస్య ప్రేమ కథ.

చరిత్ర పుటలలో దాగిన రమణీయ శృంగార గాథ.

ఒకరు సుమారు 2300 సంవత్సరాల క్రితం నాటి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్.

మరొకరు అమెజాన్ యొక్క గొప్ప యోధ రాణి, థాలెస్ట్రిస్.

అలాంటి ఇద్దరు గొప్ప యోధుల ప్రేమకథ – ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో ఊహించుకోండి!

కొంతమంది ఈ కథనాన్ని నమ్ముతారు; మరి కొందరు ప్రామాణికమైన రుజువు లేనందున నమ్మరు.

ఇది నిజమా? లేక కవుల కల్పనా? అనేది ప్రక్కన పెడితే, ‘అలాంటి యిద్దరు మహా యోధుల మధ్య ఒక శృంగార అనుబంధం వుండేది’, అనే ఊహ – ఎల్లప్పుడూ చాలా మధురంగా మరియు ఉత్కంఠ భరితంగా ఉంటుంది కదా?

అమెజాన్లు యుద్ధ విద్యలలో ఆరితేరిన స్త్రీ యోధుల తెగకు చెందిన వారని గ్రీకు పురాణాలలో వర్ణించ బడింది.

వారు ఆసియా మైనర్ అంటే ప్రస్తుత టర్కీలో నివసిన్చేవారని అంటారు.

మరి కొన్ని వర్ణనల ప్రకారం, అమెజాన్‌లు గొప్ప పోరాట యోధులు మరియు తీవ్ర స్త్రీ వాదులు (హార్డ్ కోర్ ఫెమినిస్ట్ లు). 

అలెగ్జాండర్ పాలనా కాలంలో థాలెస్ట్రిస్ అమెజాన్స్ యొక్క రాణి.

ఆమె ధైర్యం మరియు అందానికి చాలా ప్రసిద్ధి చెందింది.

‘డియోడోరస్ సికులస్’ చెప్పిన దాని ప్రకారం ఈ ప్రేమకథ క్రీస్తుపూర్వం 330లో ప్రారంభమవుతుంది.

డయోడోరస్ సికులస్ ఒక ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు. అతను క్రీ.పూ. మొదటి శతాబ్దంలో జీవించాడు. ఆయన 40 పుస్తకాలలో ప్రపంచ చరిత్రను మొట్ట మొదటగా రాసిన ప్రాచీన రచయిత.

ఆయన ‘బిబ్లియోథెకా హిస్టోరికా’ (ది యూనివర్సల్ హిస్టరీ) అనే ప్రపంచ చరిత్రను క్రీ.పూ. 60 మరియు 30 మధ్య రాశారు.

అతని రచనల ప్రకారం, ఈ ప్రేమకథ అలెగ్జాండర్ ది గ్రేట్ చేత పెర్షియన్ రాజు మూడవ డారియస్ యొక్క ఓటమి నుండి మొదలవుతుంది.

 డయోడోరస్ అలెగ్జాండర్ ను జగదేక వీరుడని, పురుషులలో అత్యంత గొప్పవాడని; అదే విధంగా థాలెస్ట్రీస్ ను స్త్రీ లలో అత్యంత శక్తి వంతురాలైన సాహస నారి అని కీర్తించాడు.

ఆయన తన ప్రపంచ చరిత్రలో వివరించిన ప్రకారం:

డారియస్‌పై విజయం సాధించిన తర్వాత, అలెగ్జాండర్ కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఆధునిక ఇరాన్ మరియు తుర్క్‌మెనిస్తాన్‌లోని హిర్కానియాకు చేరుకుని అక్కడ తన సైన్యంతో విడిది చేశాడు.

అలెగ్జాండర్ ఆ శిబిరంలో ఉన్నప్పుడు, తన అంగ రక్షకులైన తన 300 మంది మహిళా యోధులతో థాలెస్ట్రిస్ అక్కడికి చేరుకుంది.

ఆమె యొక్క ఆకస్మిక రాకకి ఆశ్చర్య పోయిన అలగ్జాండర్ వచ్చిన కారణాన్ని అడిగాడు.

అతని విజయ గాథలు విని మోహించానని అతని ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకున్నానని ఆమె సమాధానం ఇచ్చింది.

మనలాంటి ఉన్నతమైన తల్లిదండ్రుల సంతానం శ్రేష్ఠతలో ఇతర మానవులందరినీ అధిగమిస్తుందని ఆమె అతనికి చెప్పింది.

ఆమె అలెగ్జాండర్‌ను శృంగారానికి ఆహ్వానించింది.

అలెగ్జాండర్ ఆమె మనసు తెలుసుకుని ఎంతో సంతోషించాడు. ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

వారు 13 రోజుల పాటు పగలూ రాత్రీ శృంగార రసాస్వాదనలో కాలం గడిపారు.

గర్భం దాల్చిందని నిశ్చయించుకున్న తర్వాత వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది.

అలెగ్జాండర్ ఆమెను ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించి ఘనంగా వీడ్కోలునిచ్చాడు.

తన మహిళా యోధులతో థాలెస్ట్రిస్ అక్కడి నుండి బయలుదేరింది.

ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది.

అలెగ్జాండర్ బిడ్డకు జన్మనివ్వాలనే థాలెస్ట్రిస్ కోరిక నెరవేరిందా?

ఇది మరొక మనోహరమైన కథకి ఆరంభ మవుతుంది. 

ఈ విషయాన్ని మరొక బ్లాగ్ లో డిస్కస్ చేద్దాం. మా చానల్ విజిట్ చేసి ఈ వీడియోను ఎంజాయ్ చేయండి.

Presented by:

Leave a Reply