అత్యంత ఘోరమైన అగ్నిపర్వత విపత్తులు
అగ్నిపర్వతం అనేది లావా, రాళ్ల శకలాలు, వేడి ఆవిరి మరియు వాయువు వంటి మాంటిల్ (క్రస్ట్ మరియు కోర్ మధ్య పదార్థం) కలిగిన శంఖాకార పర్వతం.
అగ్నిపర్వతాలు ఎలా విస్ఫోటనం చెందుతాయి?
అగ్నిపర్వతం యొక్క దిగువ భాగంలో ఉన్న రాతి పదార్థాలు అధిక ఉష్ణోగ్రతలకు చేరుకున్నప్పుడు శిలాద్రవం (magma =కరిగిన శిల) ఏర్పడుతుంది. ఈ శిలాద్రవం వేడి, పీడనం మరియు వాయువులకు గురైనప్పుడు లావాగా విస్ఫోటనం చెందుతుంది.
లావా అగ్నిపర్వతాలతో పాటు విషపూరిత వాయువులు, బూడిద, సిండర్స్ (బొగ్గు పదార్థం) మరియు రాతి శకలాలు బయటకు వస్తాయి. ఇది పైరోక్లాస్టిక్ ప్రవాహంగా మారుతుంది.
పైరోక్లాస్టిక్ ప్రవాహం (pyroclastic flow) అంటే ఏమిటి? అది ఎలా ప్రాణాంతకంగా మారుతుంది?
అగ్నిపర్వత ఉత్పత్తుల యొక్క లావా మరియు ఇతర విషపూరిత మూలకాల యొక్క ఘోరమైన కలయికను పైరోక్లాస్టిక్ ప్రవాహం అంటారు. అవి లావా కంటే ఘోరమైనవి మరియు ఎక్కువ వినాశనాన్ని కలిగిస్తాయి.
అగ్నిపర్వత పేలుడు సూచిక (Volcanic Explosive Index ) (VEI):
ఇది సాపేక్ష కొలత స్కేల్‌పై అగ్నిపర్వత విస్ఫోటనాల పేలుడు తీవ్రతను సూచించే విలువ.
ఇది ఒక ఓపెన్-ఎండ్ స్కేల్. విస్ఫోటనం యొక్క అతిపెద్ద విస్ఫోటనం 8 గా గుర్తించబదుతుంది. దీనినే అతి పెద్ద పేలుడు విస్ఫోటనం (mega-colossal explosive eruption) అని కూడా వ్యవహరిస్తారు.
విస్ఫోటనం యొక్క అత్యల్ప రేటింగ్ 0. దీనిని పేలుడు లేని విస్ఫోటనం (non-explosive eruption) అంటారు.
భయంకర పైరోక్లాస్టిక్ ప్రవాహాలతో అత్యంత దారుణ మైన మారణ కాండను సృష్టించిన అగ్నిపర్వతాలు:
ఇలాంటి డేడ్లీఎస్ట్ అగ్నిపర్వత ఎరప్షన్స్ చరిత్రలో ఏడింటిని చెప్పుకోవచ్చు.
మౌంట్ టాంబోరా (టోంబోరా) / [Mount Tambora (Tombora)]: ఇండోనేషియా – 1815:
ఇది ఇండోనేషియాలోని సుంబావా (Sumbawa – లెస్సర్ సుండా దీవులు)లో ఉంది. 1812లో టాంబోరా పర్వతం అత్యంత చురుకు (active) గా మారింది.
టాంబోరా యొక్క అత్యంత ఘోరమైన విస్ఫోటనం 1815 ఏప్రిల్ 5 న జరిగింది. ఇది దాదాపు 92,000 మంది ప్రాణాలను కబలించి వేసింది. ఈ అగ్నిపర్వత పేలుడు 10,000 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు మానవ చరిత్రలో నమోదైన అతిపెద్ద మరియు ప్రాణాంతకమైన విస్ఫోటనంగా పరిగణించ బడింది.
దీని అగ్నిపర్వత పేలుడు సూచిక (Volcanic Explosive Index (VEI) 7.
ప్రేలుడు ఎంత తీవ్రంగా ప్రమాదకరంగా సంభవించిందో ఈ సంఖ్యను బట్టి చెప్పవచ్చు.
ఈ భయంకరమైన విస్ఫోటనం టాంబోరా పర్వతం యొక్క ఎత్తును 1450 మీటర్లు (4,757 అడుగులు) తగ్గించింది.
విస్ఫోటనానికి ముందు టాంబోరా ఎత్తు 4,300 మీ (14,100 అడుగులు).
విస్ఫోటనం తర్వాత టాంబోరా ఎత్తు 2,850 మీ (9,350 అడుగులు).
విస్ఫోటనం యొక్క శబ్దం 1200 మైళ్ల (2,000 కి.మీ) దూరంలో ఉన్న సుమత్రా ద్వీపం వరకు వినబడింది.
టాంబోరా విస్ఫోటనం వల్ల సంభవించిన విపరిణామాలు:
విస్ఫోటనం తరువాత ప్రపంచవ్యాప్తంగా అనేక వాతావరణ దుష్పరిణామాలు సంభవించాయి.
1. ఉత్తరార్ధగోళంలో తీవ్ర కరువు ఏర్పడింది.
2. ఉత్తర అమెరికా మరియు ఐరోపా ప్రాంతాలపై వాతావరణ దుష్ప్రభావాలు.
3. 1816లో పై ప్రాంతాలలో వేసవికాలం ఏర్పడ లేదు.
4. విస్ఫోటనం కారణంగా పైరోక్లాస్టిక్ ప్రవాహాలు, సునామీలు మరియు కాల్డెరా పతనం వంటివి సంభవించాయి.
టాంబోరా పర్వతం ఇప్పటికీ చురుకుగా ఉంది. దాని చివరి విస్ఫోటనం 1967లో సంభవించింది.
క్రకటౌ (క్రకటోవా) / Krakatau (Krakatoa): ఇండోనేషియా – 1883:
జావా మరియు సుమత్రా దీవుల మధ్య ఇండోనేషియాలోని లాంపంగ్ ప్రావిన్స్‌లో క్రాకటౌ దీవులు వున్నాయి. వీటిని క్రకటోవా ద్వీపసమూహం అని పిలుస్తారు.
(క్రకటోవా) ద్వీపసమూహం (Krakatoa archipelago) అంటే ఏమిటి?
(క్రకటోవా) ద్వీపసమూహం అనేది ఒక పెద్ద నీటిలో ఉన్న అనేక ద్వీపాల యొక్క విస్తృత సమూహం.
క్రాకటౌ అనేది సుండా జలసంధిలోని కాల్డెరా (డొల్ల భాగం = hollow part).
1883 ఆగస్టు 27న జరిగిన నాలుగు భారీ విధ్వంసక పేలుళ్ల శ్రేణి ప్రభావంతో క్రాకటౌ దీవులు దాదాపుగా నాశనమయ్యాయి. నమోదైన మరణాల సంఖ్య దాదాపు 36,417. కానీ ఈ విషాదంలో దాదాపు 120,000 మందికి పైగా మరణించినట్లు మరి కొన్ని వర్గాల ద్వారా అంచనా వేయబడింది.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లోని ప్రజలు 1930 మైళ్ల దూరంలో (3,100 కిమీ) పేలుడు శబ్దాలను విన్నారు. 3,000 మైళ్ల (4,800 కి.మీ) దూరంలో వున్న మారిషస్‌లో కూడా ఈ విష్పోటణా శబ్దాలు వినిపించాయి.
క్రాకటౌ విస్ఫోటనం యొక్క అగ్నిపర్వత పేలుడు సూచిక (VEI) 6. విస్ఫోటనం చెందిన రాతి పదార్ధం సుమారు 6 క్యూబిక్ మైళ్ల (25 చ.కి.మీ.) పరిధి వరకు బయటకు వెదజల్లబడింది.
1883 విస్ఫోటనం ద్వారా ఏర్పడిన కాల్డెరా నుండి నాల్గవ ద్వీపం ఉద్భవించింది, దీనిని 1927లో అనక్ క్రకటౌ (క్రకటౌ చైల్డ్) అని పిలుస్తారు.
1883 విస్ఫోటనం యొక్క విపరిణామాలు:
ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉష్ణోగ్రతలు సంవత్సరంలో సగటున 0.40C (0.720F) వరకు తగ్గాయి.
మౌంట్ (మాంట్) పీలీ / (Mount (Mont) Pelee): మార్టినిక్ – 1902.
మార్టినిక్ (Martinique) అనేది తూర్పు కరీబియన్‌లోని విండ్వర్డ్ దీవులలోని ఒక ద్వీపం. ఇది ఫ్రాన్స్ పాలనలో వున్న ద్వీపం.
మోంట్ పీలీ అంటే “బట్టతల లేదా ఒలిచిన పర్వతం” అని అర్థం. ఇది లావా మరియు బూడిద యొక్క ప్రత్యామ్నాయ పొరల ద్వారా నిర్మించబడిన స్ట్రాటోవోల్కానో. 1902లో దాని విస్ఫోటనం 20వ శతాబ్దపు అత్యంత ఘోరమైన మరియు దారుణమైన అగ్నిపర్వత విస్ఫోటనంగా పరిగణించబడుతుంది. సెయింట్-పియర్ (Saint-Pierre) పట్టణం పూర్తిగా నాశనం కాబడింది.
మృతుల సంఖ్య 29,025. పేలుడు ద్వారా విరజిమ్మిన లావా యొక్క ప్రత్యక్ష ప్రవాహ మార్గంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే బ్రతికి బయటపడ్డారు.
1902 విస్ఫోటనం వల్ల సంభవించిన నష్టం నుండి సెయింట్-పియర్ నగరం పూర్తిగా కోలుకోలేదు. విపత్తు తర్వాత కొన్ని గ్రామాలు ఏర్పడ్డాయి మరియు నగరం పాక్షికంగా నిర్మించబడింది. 2004లో నగర జనాభా 4,544కి మాత్రమే చేరుకొంది.
ఇది ఇటీవల 1932లో విస్ఫోటనం చెందింది మరియు ఇప్పటికీ క్రియాశీల స్థితిలో ఉంది.
నెవాడో డెల్ రూయిజ్ (Nevado Del Ruiz): కొలంబియా (Colombia) – 1985:
స్పానిష్ భాషలో, నెవాడో అంటే “మంచుతో కప్పబడినది” అని అర్థం. ఈ అగ్నిపర్వతం యొక్క శిఖరం పెద్ద హిమానీనదాల (glaciers) తో కప్పబడి ఉంది. శిఖరం చుట్టూ దాదాపు 50 మీ (160 అడుగులు) మందంతో ఒక టోపీలా (snowcap ) మంచు పేరుకొని వుంటుంది.
ఈ అగ్నిపర్వతం కొలంబియా (రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా)లో ఉంది, ఇది దక్షిణ అమెరికాలోని కాల్డాస్ మరియు టోలిమా విభాగాల మధ్య ఉన్న దేశం.
ఈ అగ్నిపర్వతం లాస్ నెవాడోస్ నేషనల్ పార్క్ యొక్క ఉత్తర అగ్నిపర్వత సముదాయంలో భాగం. ఈ ఉద్యానవనం అనేక ఇతర అగ్నిపర్వతాలకు స్థలం మరియు పసిఫిక్ తీరం వెంబడి కొలంబియన్ ఆండీస్ పర్వత శ్రేణి మధ్యలో ఉంది.
ఇది స్ట్రాటోవోల్కానో సమూహానికి చెందినది. స్ట్రాటోవోల్కానోలు లావా, బూడిద మరియు రాళ్ళు మరియు రాతి శకలాలు అనేక ప్రత్యామ్నాయ పొరలను కలిగి ఉంటాయి.
నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం యొక్క అత్యంత ఘోరమైన విస్ఫోటనం 13 నవంబర్ 1985న సంభవించింది. ఒక చిన్న విస్ఫోటనం వలె ప్రారంభమైంది మరియు దాదాపు 25,000 మందిని పొట్టన పెట్టుకుంది. కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ యొక్క వేడి వాయువులు లావాతో కలిసి పర్వతం యొక్క స్నోక్యాప్ను కరిగించి, చుట్టుపక్కల ప్రాంతాలను పెద్ద మొత్తంలో నీటితో ముంచేసాయి. టోలిమా డిపార్ట్మెంట్లోని అర్మెరో పట్టణం దట్టమైన లాహర్ చే ఖననం చేయబడి పూర్తిగా నాశనం కాబడింది.
ఈ సంఘటనను ఆర్మెరో ట్రాజెడీ అని పిలుస్తారు. ఇది అత్యంత ఘోరమైన లాహర్ గా నమోదు పరిగణించబడింది.
లహర్ (Lahar) అంటే ఏమిటి?
లాహర్ అనేది అగ్నిపర్వతం యొక్క వాలులో సంభవించే అగ్నిపర్వత నీరు మరియు బురదలు కలగలసిన విధ్వంసక హిమపాతం.
నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం ఇప్పటికీ సమీపంలోని పట్టణాలు మరియు గ్రామాలకు ముప్పుగా ఉంది. దాదాపు 500,000 మంది ప్రజల ప్రాణాలు డేంజర్ లో వున్నాయి.
అంజెన్ (Unzen): జపాన్ – 1792:
జపాన్‌లోని క్యుషు ద్వీపంలోని నాగసాకి ప్రిఫెక్చర్ (జిల్లా)లోని షిమబారా నగరానికి సమీపంలో ఉన్న క్రియాశీల స్ట్రాటోవోల్కానోలలో జపాన్‌లోని మౌంట్ అంజెన్ ఒకటి.
1792 మే 21న మౌంట్ అంజన్ యొక్క విస్ఫోటనం తర్వాత సంభవించిన భూకంపం మరియు మెగా సునామీ కారణంగా 14,300 మంది మరణించారు.
అంజెన్ పర్వతం ముందు ఉన్న మయూయామా గోపురం యొక్క దక్షిణ పార్శ్వం విపరీతమైన సునామీకి దారితీసింది. లావా రెండు నెలలు నిరంతరంగా ఎగసిపడింది.
విస్ఫోటనం అనంతర భూకంపం సంభవించి మయూయామా గోపురం యొక్క తూర్పు పార్శ్వం కూడా కూలిపోయింది.
ఇది జపాన్ చరిత్రలో అతిపెద్ద భయంకర అగ్నిపర్వత విపత్తుగా నమోదు కాబడింది.
అంజెన్ అగ్నిపర్వతం 20 కంటే ఎక్కువ పర్వతాలచే ఏర్పడింది.
లాకీ (Laki): ఐస్లాండ్ – 1783:
లాకీ (లకాగిగర్) పర్వతం ఐస్లాండ్లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్ యొక్క పశ్చిమ భాగంలో ఉంది. దీనిని అగ్నిపర్వత పగులు (volcanic fissure) అంటారు.
అగ్నిపర్వత పగులు అనేది ఎటువంటి పేలుడు చర్య లేకుండా సరళ రేఖలో ఏర్పడే లావా యొక్క బిలం (linear vent). సాధారణంగా ఈ బిలం కొన్ని మీటర్ల వెడల్పుతో అనేక కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది.
1783 జూలై 8న ఈ అగ్నిపర్వతం యొక్క ఆవిరి-పేలుడు విస్ఫోటనం (Volcanic fissure) తో 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో 130 గుంటలతో కూడిన పగుళ్లు సంభవించాయి.
అగ్నిపర్వత పేలుడు సూచిక (VEI) 4 గా నమోదు కాబడింది.
అపారమైన బసాల్ట్ లావా, టెఫ్రా (ఫ్రాగ్మెంటల్ మెటీరియల్) మరియు విషపూరిత సమ్మేళనాలతో కూడిన మేఘాలు (హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ సమ్మేళనాలు) ఐస్లాండ్లోని 50% పైగా పశువుల జనాభా నాశనానికి దారితీశాయి. 9,350 మంది మనుష్యులు చనిపోయారు.
ఇది విస్తారమైన నేలను కలుషితం చేసింది. పంటలన్నీ చాలావరకు దెబ్బతిన్నాయి.
ఈ విపత్కర సంఘటన యొక్క విపరిణామాలు:
1. ప్రపంచ ఉష్ణోగ్రతలలో తగ్గుదల కనిపించింది.
2. ఉత్తర అర్ధగోళం 120 మిలియన్ టన్నుల సల్ఫర్ డయాక్సైడ్తో నిండిపోయింది.
3. ఐరోపాలో పంటల వైఫల్యం సంభవించింది.
4. ఐస్లాండ్లో కరువు ఫలితంగా దాని జనాభాలో దాదాపు 1/4 వంతు మంది మరణించారు.
5. ఉత్తర అమెరికా మరియు భారతదేశంలో కరువులు ఏర్పడ్డాయి.
కెలుట్ (కెలుడ్) (Kelut (Kelud): ఇండోనేషియా – 1919:
కెలుట్ పర్వతం స్ట్రాటోవోల్కానో వర్గానికి చెందిన మిశ్రమ అగ్నిపర్వతం. ఇది ఇండోనేషియాలో తూర్పు జావాలోని కేద్రీ వద్ద ఉంది. క్రీ.శ. 1100 నుండి సుమారు 30 పెద్ద పెద్ద పేలుడు విస్ఫోటనాలు ఇక్కడ సంభవించాయి.
1919 మే 19 న దాని విస్ఫోటనం ద్వారా విపరీతమైన వేగంతో ముంచెత్తే ఉష్ణ బురద ప్రవాహం (లహర్) సంభవించింది. ఈ లాహర్ 5,110 మంది చావుకి కారణమైంది. దీనిని చరిత్రలో వినాశకరమైన ఉష్ణ బురద ప్రవాహ విస్ఫోటనాలలో ఒకటిగా పేర్కొంటారు.
గంటకి 60 కి.మీ వేగంతో అత్యంత వేడిగా ఉన్న బురద ప్రవాహం – ఉదానవు జిల్లాలోని సుంబెర్సరి, సలాం, న్గోరన్ వంటి అనేక గ్రామాలను నాశనం చేసింది. బ్లిటార్ నగరానికి దారితీసే ఇతర గ్రామాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిమిషాల వ్యవధిలో ఈ ఉష్ణ లాహర్కు అడ్డంగా ఉన్నవన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కాఫీ పొలాలు మరియు ఇతర వ్యవసాయ భూములు ఈ లాహర్ వల్ల భారీగా దెబ్బతిన్నాయి.