First Olympics-First Prize/T

మొట్ట మొదటి ఒలింపిక్స్‌లో జరిగిన మొదటి ఈవెంట్ ఏది?

మొదటి ఒలింపిక్ విజేతకు యిచ్చిన ప్రైజ్ (బహుమతి) ఏమిటి?

ఇది వినడానికి చాల గమ్మత్తుగా వుంటుంది….

చరిత్రలో లిఖించ బడిన దాని ప్రకారం, మొట్ట మొదటి ఒలింపిక్ క్రీడలు క్రీస్తు పూర్వం 776 లో జరిగాయి. అప్పటి నుండి, పురాతన గ్రీస్‌లో ఒలింపిక్ క్రీడల మధ్య నాలుగు సంవత్సరాల విరామంతో అవి పన్నెండు శతాబ్దాల పాటు కొనసాగాయి.

ఒలింపిక్ క్రీడల మూలం గురించి ప్రచారంలో వున్నా ఒక మిత్ (Myth) (కథనం):

గ్రీకు పురాణాలలో ఒలింపిక్స్ ప్రారంభం గురించి అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి.

ఒక కథనం ప్రకారం, సుప్రీమ్ దేవుడైన జ్యూస్ (Zeus) ఒలింపిక్ క్రీడలను ప్రారంభించాడని చెబుతుంది. సారవంతమైన మైదానభూమి అయిన థెస్సాలీలోని మౌంట్ ఒలింపస్ ఆ దేవుని యొక్క అత్యున్నత స్థాన మని చెప్తారు.

పురాతన గ్రీకు పురాణాల ప్రకారం, అతను మానవజాతిని రక్షించే పాలకుడు. అతను ప్రకృతి మరియ వాతావరణాలకి కూడా దేవుడు. అతను వర్షం మరియు ఉరుములతో పాటు మంచి మరియు చెడులను మానవాళికి పంచుతాడు.

జ్యూస్ సంతానోత్పత్తి దేవత అయిన రియా (Rhea) మరియు సర్వోన్నత దేవుడైన క్రోనస్ (క్రోనోస్) (Cronos or Kronos) లకి పుట్టిన కుమారుడు. అతను తన తండ్రి క్రోనస్‌ను పదవి నుండి తొలగించి నప్పుడు తండ్రిపై తన విజయానికి గుర్తుగా ఒలింపిక్ క్రీడల ప్రారంభాన్ని ప్రకటించాడని చెపుతారు.

క్రీస్తు పూర్వం 776 కి ముందు ఒలింపిక్స్‌ క్రీడలు జరుపుకునేవారా?

క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందిన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు అయిన పౌసానియాస్ (Pausanias) క్రీస్తు పూర్వం 776 కి ముందే జరిగిన పూర్వ ఒలింపిక్ క్రీడల గురించి కొంత ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు.

ఆయన పురాతన గ్రీస్‌పై “ది ఇటినెరరీ ఆఫ్ గ్రీస్” (గ్రీస్ యొక్క వివరణ) పేరుతో ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ఇప్పటికీ పురాతన గ్రీస్ యొక్క స్థలాకృతి మరియు అవశేషాల గురించిన సమాచారం యొక్క అమూల్యమైన మూల గ్రంథంగా పరిగణించబడుతుంది.

క్రీ.పూ. 776 లో మొదటిసారిగా నమోదు కాబడిన ఒలింపిక్ క్రీడల కంటే చాలా కాలం ముందే ఒలింపిక్ క్రీడలు నిర్వహించబడుతూ వస్తున్నాయని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నాడు.

అతని కథనం ప్రకారం, ఒలింపిక్స్ కొంత అనిశ్చిత గేప్ తర్వాత, క్రీ.పూ. 9వ శతాబ్దంలో రాజు ఇఫిటస్ ద్వారా తిరిగి ప్రారంభించ బడ్డాయి. దీనిని బట్టి క్రీస్తుపూర్వం 9వ శతాబ్దానికి చాలా కాలం ముందే ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

డెల్ఫిక్ కథ:

డెల్ఫీ పురాతన గ్రీకు నగరం మరియు అత్యంత ముఖ్యమైన మతపరమైన పవిత్ర కట్టడాలలో ఒకటి. ఇది డెల్ఫీ ఒరాకిల్ యొక్క (భవిష్య వాణిని చెప్పే) ప్రదేశం.

డెల్ఫీ ప్రదేశం సూర్య-దేవుడైన అపోలోకు అంకితం చేయబడింది. అది మధ్య గ్రీస్‌లోని మౌంట్ పర్నాసస్ (Parnassus , ఇది కొరింత్ గల్ఫ్ పైన) దిగువ దక్షిణ వాలుపై ఉంది, ఇక్కడ గ్రీక్ మ్యూసెస్ (గ్రీకు కళా దేవతలు) నివసిస్తారని ప్రతీతి. ఇది సంగీత కవిత్వాల ఉనికికి నిలయం.

ఒరాకిల్ డెల్ఫీ యొక్క ఆజ్ఞ:

ఆ రోజుల్లో విచ్చల విడిగా వ్యాపించి వున్న అంతర్గత కలహాలు మరియు ప్లేగు వ్యాధి వంటి దురావాస్తల బారి నుండి తప్పించుకోవడానికి గ్రీకు ప్రజలకు సహాయం చేయమని ఇఫిటస్ రాజు డెల్ఫీలోని దైవాన్ని ప్రార్థించినట్లు పౌసానియాస్ తన పుస్తకంలో రాశారు.

డెల్ఫిక్ ఒరాకిల్ అంటే ఒక పూజారిని. సహాయం కోసం డెల్ఫి  (అపోలో) దేవున్ని ప్రార్థించే వారికి ఆయన యిచ్చే సందేశాలను ఆమె అందజేస్తుంది.  

డెల్ఫిక్ ఒరాకిల్ (పైథియన్ పూజారిని) చిక్కుముడుల (riddles) వలె అస్పష్టమైన పద్ధతిలో ఆదేశాలను యిస్తుందని వివరించబడింది.

ఇఫిటస్ రాజు ప్రార్థనలు విన్న ఆమె దేవుని సందేశంగా ఒలింపిక్ క్రీడలను పునః ప్రారంభించాలని తన సమ్మతిని తెలిపినట్లు ఆ పుస్తకంలో చెప్పబడింది.

ఒలింపిక్స్ క్రీడల నాటకీయ పునః ప్రారంభం:

రికార్డ్ కాబడిన హిస్టరీ ప్రకారంగా మొట్టమొదటి ఒలింపిక్స్ చెప్పాలంటే చాలా నాటకీయంగా ఒక మతపరమైన పండుగగా పునః ప్రారంభమైంది. అది శాంతిని సూచించే సందర్భంగా  ప్రకటించబడింది. అన్ని గ్రీకు నగరాల నుండి హాజరు కావడానికి పురుషులు ఆహ్వానించబడ్డారు.

స్థలం:

ఒలింపియాలోని పెలోపొన్నీస్ (Peloponnese) స్టేడియం.

సమయం:

776 BCE.

హాజరైన సందర్శకులు:

40,000 మందికి పైగా ప్రజలు.

మొదటి ఈవెంట్:

స్టేడియన్ (Stadion).

ఇది 200 మీ. అంటే 650 అడుగుల కంటే పొడవైన ఎక్కువ రేసు. చారిత్రక ఆధారాల ప్రకారం యిదే మొట్టమొదటి ఒలింపిక్స్‌ లో నిర్వహించ బదిఅన మొట్టమొదటి ఒకే ఒక్క ఈవెంట్.

విజేత:

కోరియోబస్ (Coreobus).

అతను ఒక వంటవాడు మరియు ఎలిస్ (Elis) ప్రాంతంలోని స్థానిక సంఘానికి చెందినవాడు.

మొట్ట మొదటి ఒలింపిక్స్‌లో మొదటి విజేతకు యిచ్చిన మొదటి బహుమతి:

ఇది వినడానికి చాల గమ్మత్తుగా వుంటుంది.

ఆ బహుమతేంటంటే – ఆపిల్ చెట్టు యొక్క ఒక కొమ్మ.

తదనంతర క్రీడలలో నెగ్గిన ఛాంపియన్‌లకు యివ్వబడ్డ బహుమతులు:

గ్రీక్ ఒలింపిక్స్‌కు జోడించిన ఈవెంట్‌ల జాబితా పెరిగేకొద్దీ తదనుగుణంగా బహుమతులు కూడా పెంచబడ్డాయి.

తరువాతి ఛాంపియన్‌లను గొప్ప ఆర్థిక బహుమతులతో పాటు ఆలివ్ దండలతో సత్కరించే వారు.

నేకెడ్ (నగ్న) గ్రీక్ ఒలింపిక్స్ చరిత్ర:

మనకు అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం, గ్రీక్ ఒలింపిక్స్ క్రీ.పూ. 720 వరకు క్రమ క్రమంగా నగ్న ఒలింపిక్స్‌గా మారాయి. అథ్లెట్లు నగ్నంగా పోటీ చేసేవారు.

దాని వెనుక ఉన్న మోటో ఏంటంటే, ఒలింపిక్స్‌ను ‘మానవ శరీర పండుగ’ గా భావించి జరుపుకునే వారు.

ఒలింపిక్ క్రీడలు థియోడోసియస్ చే నిషేధించబడ్డాయి:

ఫ్లేవియస్ థియోడోసియస్ (c. 346-395 CE), (థియోడోసియస్ ది గ్రేట్ అని పిలుస్తారు). ఈయన క్రీ.శ. 379 లో బైజాంటైన్ చక్రవర్తి అయ్యాడు.

థియోడోసియస్ ఐక్య రోమన్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి. అతను తూర్పు సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. విసిగోత్‌లతో యుద్ధం అతని ద్వారా ముగిసింది. విసిగోత్‌లు అనే వారు గోత్‌ల అనబడే జాతి యొక్క పశ్చిమ సమూహం. వారు రోమ్‌ను కొల్లగొట్టి, ప్రస్తుత స్పెయిన్ మరియు దక్షిణ ఫ్రాన్స్‌ లలో రాజ్యాన్ని సృష్టించారు.

థియోడోసియస్ క్రైస్తవ మతాన్ని తీసుకున్నాడు. ఫలితంగా, అతను 391లో అన్ని రకాల అన్యమత ఆరాధనలను నిషేధించాడు.

పవిత్రమైన క్రైస్తవుడిగా అతను ఒలింపిక్ క్రీడలను అన్యమత యుగం నుండి సంక్రమించిన అసంబద్ద హ్యాంగోవర్‌గా పరిగణించి వాటిని క్రీ.శ. 394 లో రద్దు చేశాడు.

ఒలింపియాడ్ – ఒలింపిక్ క్రీడల ఆధునిక పునరుజ్జీవనం:

ఒలంపిక్ క్రీడలను పునరుద్ధరించాలనే కల ఫ్రెంచ్ జమీందారు (బారన్) అయిన పియరీ డి కూబెర్టిన్ (Pierre de Coubertin) కృషితో సాకారమైంది. అథ్లెటిక్ నైపుణ్యం మరియు అంతర్జాతీయ సామరస్యాన్ని పెంపొందించడానికి ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి అతను 1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (International Olympic Committee) ని ఏర్పాటు చేశాడు.

ఒలింపియాడ్ అని పిలువబడే ఒలింపిక్స్ యొక్క ఆధునిక పునరుజ్జీవనం ఏప్రిల్ 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో అధికారికంగా ప్రారంభించబడింది. మొదటి ఒలింపియాడ్‌ను 10 రోజులు జరుపుకున్నారు. పద్నాలుగు దేశాల నుండి 241 మంది పురుష ఔత్సాహిక క్రీడాకారులు తమ సొంత ఖర్చులతో తమ యొక్క దేశాల తరపున కాకుండా ప్రైవేట్ వ్యక్తులుగా యిందులో పాల్గొన్నారు.

అప్పటి నుండి ఒలింపియాడ్ ఎంపిక చేసిన దేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుపు రివాజుగా వస్తున్నది.

Presented by:

Leave a Reply