Facts & Factoids-10/T

01. రైనాసరాస్ బీటిల్ అత్యంత బలమైన జంతువు. అది దాని బరువు కంటే 850 రెట్లు అధికంగా ఎత్తగలదు.

రైనాసరాస్ బీటిల్ ఖడ్గమృగం వంటి కొమ్ములను కలిగి ఉంటుంది. అందువల్లనే దానిని రైనాసరాస్ బీటిల్ అని పిలుస్తారు (రైనాసరాస్ అంటే ఖడ్గమృగం అని అర్థం). అవి శాకాహారులు. పెద్దవి పండ్లు, మధురసం (నెక్టార్), రసం తింటాయి. వాటి లార్వా కుళ్ళిపోతున్న మొక్కలు తదితర పదార్థాలను తింటాయి. ఇవి 15 సెం.మీ (6 అంగుళాలు) వరకు పెరుగుతాయి కాబట్టి వాటిని ప్రపంచంలోనే అతిపెద్ద బీటిల్స్ అనవచ్చు. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని ప్రతిచోటా ఇవి కనిపిస్తాయి.

కదలిక లేదా వేగంలో ఎలాంటి సమస్య లేకుండా, కొన్ని జాతుల పెద్ద రైనాసరాస్ బీటిల్స్ తమ సొంత బరువు కంటే 30 రెట్లు ఎక్కువ మోయగలవు. వేగంలో కొంత ఇబ్బందితో వాటి లిఫ్టింగ్ కెపాసిటి తమ స్వంత బరువు కంటే 100 నుండి 850 రెట్లు పైగా ఉంటుంది. ఈ లక్షణమే వాటిని ప్రపంచంలోనే బలమైన జంతువుగా చేసింది. ఆడవారితో జతకట్టడం కోసం మగ బీటిల్స్ ఇతర మగవాటితో పోరాడుతాయి. ఆడవాటి నుండి ఇతర మగబీటిల్స్ ను తరిమికొట్టడానికి అవి తమ బలమైన కొమ్ములను ఉపయోగిస్తాయి. ఆడ బీటిల్స్ దాదాపు 50 గుడ్లు పెడతాయి.

వాటి జీవితకాలం 1 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అవి తమ జీవితంలో ఎక్కువ భాగం లార్వా-దశలో గడుపుతాయి. పగటిపూట అవి ఆకుల చెత్త, మొక్కలు మరియు పడిపోయిన దుంగల్లో దాక్కుంటాయి.

02. నోటి నుండి వచ్చే మామూలు దగ్గు గంటకు 60 మైళ్ల (96.5 కి.మీ) వేగంతో వస్తుంది.

దగ్గు అనేది ఊపిరితిత్తుల నుండి అకస్మాత్తుగా శబ్దంతో విసురుగా బయటకు వచ్చే బహిష్కరణ గాలి. కొన్ని సందర్భాలలో ఇది ఎగువ శ్వాసకోశ సంక్రమణం, బ్రోన్కైటిస్, న్యుమోనియా లేదా క్షయవ్యాధుల యొక్క సాధారణ లక్షణం. ఇది శ్వాస మార్గాలను (air passages) క్లియర్ చేస్తుంది.

దగ్గు యొక్క సగటు వేగం గంటకు 96.5 కిమీ (60 మైళ్ళు) ఉంటుంది. కొన్నిసార్లు దగ్గు శ్వాస మార్గంలోని అవాంఛిత బ్లాకులను క్లియర్ చేయడానికి 100 కి.మీలతో కూడిన మహా వేగాన్ని అందుకుంటుంది.

సాధారణ దగ్గు గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగినప్పుడు లేదా రంగు మారిన లేదా రక్తపు శ్లేష్మం వస్తున్నప్పుడు మెడికల్ ట్రీట్ మెంట్ అవసరం.

దగ్గు సాధారణంగా రెండు రకాలు – తీవ్రమైన (acute cough) లేదా దీర్ఘకాలిక (chronic cough).

తీవ్రమైన దగ్గు సాధారణంగా వస్తూ పోతూ ఉంటుంది. ఇది మూడు వారాల కంటే తక్కువ కాలమే ఉంటుంది. ఇవి ఎక్కువగా జలుబు, ఫ్లూ లేదా బ్రోన్కైటిస్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

దీర్ఘకాలిక దగ్గు సాధారణంగా 4 నుండి 8 వారాల వరకు ఉంటుంది. ఇది అలసటకు దారితీస్తుంది మరియు అరుదుగా రక్తంతో వస్తుంది. దీర్ఘకాలిక దగ్గుకు సాధారణ కారణాలు అలెర్జీలు, ఉబ్బసం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD), క్రానిక్ బ్రోన్కైటిస్, ధూమపానం, గొంతు రుగ్మతలు మరియు ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల సంక్రమిస్తుంది.

03. ప్రపంచంలో 11% మంది ఎడమచేతి వాటం కలిగి ఉన్నారు.

చేతిని వినియోగించే విధానాన్ని (handness) ‘మనం చేసే పనిని బట్టి మన కుడి చేయి, ఎడమ చేయి లేదా రెంటిని అయాచితంగా ఉపయోగించే పద్దతి’ అని నిర్వచించవచ్చు.

కుడి మరియు ఎడమ చేతివాటం అనేది సాధారణంగా మెదడు యొక్క కుడి మరియు ఎడమ భాగాల మధ్య తేడాలకు సంబంధించినది.

మెదడు యొక్క కుడి అర్ధగోళం శరీరం యొక్క ఎడమ వైపు కదలికను నియంత్రిస్తుంది. ఎడమ అర్ధగోళం శరీరం యొక్క కుడి వైపు కదలికను నియంత్రిస్తుంది.

మానవులలో ఈ చేతివాటాలు నాలుగు రకాలుగా ఉంటాయి.

1. కుడిచేతి వాటం, 2. ఎడమచేతి వాటం, 3. సవ్యసాచి, మరియు 4. క్రాస్-డామినెంట్ లేదా మిక్స్డ్ హ్యాండ్.

కుడిచేతి వాటం:

ఈ వాటం గలవారు నైపుణ్య మైన పనుల కోసం కుడి చేతిని ఉపయోగించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో దాదాపు 90% మానవులు కుడిచేతి వాటం కలిగి ఉంటారు.

ఎడమచేతి వాటం:

వారు నైపుణ్యమైన పనుల కోసం ఎడమ చేతిని ఉపయోగించడానికి ఇష్టపడతారు. జనాభాలో దాదాపు 10-11% మంది ఎడమచేతి వాటం కలిగి వుంటారు.

సవ్యసాచి (Ambidextrous):

వారు కుడి మరియు ఎడమ చేతులు రెండింటినీ సమాన కౌసల్యంతో ఉపయోగిస్టారు. చాలా తక్కువ మంది వ్యక్తులు మాత్రమే ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు.

క్రాస్-డామినెంట్ లేదా మిక్స్డ్ హ్యాండ్:

చాలా చాలా తక్కువ మంది వ్యక్తులు మాత్రమే క్రాస్ డామినెంట్ లేదా మిక్స్డ్ హ్యాండ్‌డ్‌గా ఉంటారు. వారు నాడీ వ్యవస్థ లో అభివృద్ధి చెందిన మోటారు నైపుణ్యం కలిగి ఉంటారు. వారు ఒక చేతితో కొన్ని రకాల పనులను; మరొక చేతితో వేరే పనులను చేయడానికి అనుకూలమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.

04. మానవ తొడ ఎముకలు (తొడ ఎముకలు) కాంక్రీటు కంటే బలంగా ఉంటాయి – నిజమా?

తొడ ఎముక (thigh bone or femur) హిప్ జాయింట్ యొక్క ప్రధాన అనుబంధ ఎముకలలో ఒకటి. ఇది నిలబడ్డప్పుడు, నడుస్తున్నప్పుడు, పరుగెడుతున్నపుడు లేదా దూకేటప్పుడు వివిధ రకాల ఫోర్స్ (ఇంపాక్ట్) లకు గురవుతుంది.

తన్యత (tensile), కుదింపు (compression), టోర్షన్ (torsion), కోత (shear) మరియు వంగడం (bending) వంటివి తొడ ఎముకపై సాధారణంగా ప్రభావం చూపుతాయి.

సగటున పెద్ద మగ వారి యొక్క తొడ ఎముక 48 cm (18.9 in) పొడవు; 2.34 cm (0.92 in) వ్యాసం కలిగి ఉంటుంది. తొడ ఎముక శరీరం యొక్క అధిక బరువుకు సపోర్ట్ ఇస్తుంది. దీని నిర్మాణం కార్టికల్, క్యాన్సలస్ మరియు ఎముక మజ్జ కుహరం (bone marrow cavity) తో మిశ్రమంగా ఉంటుంది.

తొడ ఎముక యొక్క బలం దాని నిర్మాణకృతి (matrix) మరియు కాఠిన్యం (hardness) లపై ఆధారపడి వివిధ స్థానాలలో వేరు వేరుగా వుంటుంది.

ఇది శరీరంలో అత్యంత పొడవైన, బరువైన మరియు బలమైన ఎముక. ఇది శరీరం యొక్క బరువు కంటే 30 రెట్లు అధికం బరువుకి మద్దతు ఇవ్వగలగుతుంది. ఈ లక్షణాలతో ఇది కాంక్రీటు కంటే బలంగా ఉందని నిరూపించబడింది.

05. ఆడ దోమలు మాత్రమే కుడతాయి. ఎందుకు?

పునరుత్పత్తి కోసం, ఆడ దోమలు రక్తాన్ని ఆహారంగా తీసుకోవటం కోసం మనుషులను మరియు ఇతర జంతువులను కుడతాయి. గుడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లను అవి రక్తం నుండి స్వీకరిస్తాయి. మగ దోమలు కుట్టవు. అవి మొక్కల యొక్క రసం, పూల తేనె మరియు నీటిని ఆహారంగా తీసుకుంటాయి.

రక్తాన్ని పీల్చుకోవడానికి, ఆడ దోమలు ప్రోబోస్సిస్ (చర్మాన్ని కుట్టడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేక నోటి భాగం) ను ఉపయోగిస్తాయి. కుట్టే సమయంలో అది ఆ దోమ యొక్క లాలాజలాన్ని మన చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇది దురదను కలిగిస్తుంది. దానివల్ల చర్మంపై ఒక గడ్డలా ఏర్పడుతుంది. మలేరియా, డెంగ్యూ మొదలైన వ్యాధులు ఆడ దోమల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయి.

తాము సంతృప్తి చెందే వరకు ఆడ దోమలు కుడుతూనే ఉంటాయి. తగినంత రక్తాన్ని తీసుకున్న తర్వాత, గుడ్లు పెట్టే ప్రక్రియకు రెండు మూడు రోజుల ముందు విశ్రాంతి తీసుకుంటాయి.

పిప్పరమెంటు, దేవదారు, దాల్చినచెక్క, నిమ్మరసం, సిట్రోనెల్లా, క్యాట్నిప్, ప్యాచౌలీ, లావెండర్ మరియు అటువంటి మరి కొన్ని సహజ సువాసనలను దోమలు భరించ లేవు.

మగ దోమల సగటు జీవిత కాలం 6-7 రోజులు వుంటుంది. ఆడ దోమలు 6 వారాల వరకు జీవిస్తాయి. తగినంత ఆహారం లభ్యమైనపుడు ఆడదోమలు 5 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు.

06. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఎడమ జఠరిక (left ventricle) ప్రతి నిమిషం 4-7 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. కఠినమైన వ్యాయామం చేస్తున్నప్పుడు; బాగా శిక్షణ పొందుతున్న అథ్లెట్‌ లలో నిమిషానికి మొత్తం దాదాపు 30 లీటర్ల వరకు ఈ సరఫరా పెరుగుతుంది.

గుండె నాలుగు గదుల నిర్మాణాన్ని కలిగి వుంటుంది. అవేంటంటే – రెండు కర్ణికలు (అట్రియా) మరియు రెండు జఠరికలు (వెంట్రికిల్స్). ఎగువ భాగాలను కర్ణికలు, దిగువ భాగాలను జఠరికలు అంటారు.

గుండె ఒకే అవయవం అయినప్పటికీ, ఇది రెండు పంప్‌ లుగా పనిచేస్తుంది. కుడి వైపు గదులు (కుడి కర్ణిక మరియు కుడి జఠరిక) మొదటి పంపు వలె పని చేస్తాయి.

కుడి కర్ణిక ఇతర శరీర భాగాల నుండి వచ్చే డీఆక్సిజనేటెడ్ (పేలవమైన ఆక్సిజన్ గల) రక్తాన్ని తీసుకుంటుంది. ఈ రక్తం కుడి జఠరికలోకి వెళ్లి పల్మనరీ వాల్వ్ సహాయంతో ఊపిరితిత్తులకు పంపబడుతుంది.

శుద్దీకరణ తర్వాత, ఊపిరితిత్తులు ఆక్సిజన్ అధికంగా ఉండే ఈ రక్తాన్ని గుండె యొక్క ఎడమ కర్ణికకు పంపుతాయి. ఎడమ కర్ణిక ఈ ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని మైట్రల్ వాల్వ్ సహాయంతో ఎడమ జఠరికకు పంపుతుంది. ఆ విధంగా ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికలు రెండూ రెండు పంపుల వలె పని చేస్తాయి.

ఎడమ జఠరిక ఈ స్వచ్ఛమైన రక్తాన్ని మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేస్తుంది.

ఈ మొత్తం ప్రక్రియను ప్రసరణ వ్యవస్థ (circulatory system) అంటారు.

రక్త ప్రసరణ రెండు రకాలుగా ఉంటుంది. 1. పల్మనరీ సర్క్యులేషన్ (Pulmonary circulation); 2. దైహిక ప్రసరణ (Systemic circulation).

పల్మనరీ సర్క్యులేషన్ అనేది గుండెను ఊపిరితిత్తులతో కలిపే ఒక చిన్న లూప్.

సిస్టేమిక్ (దైహిక) ప్రసరణ గుండె నుండి రక్తాన్ని శరీరంలోని అన్ని ఇతర భాగాలకు మరియు తిరిగి వెనుకకు తీసుకు వెళ్ళే వ్యవస్థ.

రక్తం రెండు జఠరికల ద్వారా ఒకే మొత్తంలో పంప్ చేయబడుతుంది. కానీ, దైహిక సర్క్యూట్‌లో ఎదురయ్యే ఎక్కువ ప్రతిఘటన (resistance) ను అధిగమించడానికి ఎడమ జఠరిక ద్వారా ఎక్కువ పీడనంతో రక్తం సరఫరా చేయబడుతుంది.

Presented by

Leave a Reply