Eiffel Tower & Demolition/T

ఈఫిల్ టవర్ 1909లో కూల్చివేయబడ వలసిందా?

ఎస్, కానీ అది తప్పించబడింది.

ఎందుకో తెలుసుకోవాలంటే…

పారిస్ యొక్క సార్వత్రిక చిహ్నం వెనుక ఉన్న కథను చూద్దాం.

ఈనాడు, ఈఫిల్ టవర్ పర్యాటకులకు ప్రపంచంలోని గొప్ప ఆకర్షణలలో ఒకటి.

రాట్ ఐరన్ (wrought iron) అనబడే ఇనుప నిర్మాణంతో చేసిన ఈ టవర్ యొక్క చరిత్ర 1889లో యిది ప్రారంభించబడిన రోజు నుండి చాలా ఆసక్తికరంగా సాగింది. నాలుగు పునాది కాళ్లపై నిలబెట్టిన ఈ ఇనుప నిర్మాణంలో (లాటిస్ స్టైల్ = చెక్క లేదా లోహంతో చేసిన నిర్మాణం) ఇనుప దూలములను జతచేసే లోహపు ట్రస్సుల అమరికతో టవర్ బరువు తగ్గే ఒక ప్రత్యెక శైలిని గుస్టావ్ ఐఫిల్ ఫాలో అయ్యారు.

ఇది 1889లో పారిస్‌లో జరిగిన వరల్డ్ ఎగ్జిబిషన్, “ఎక్స్‌పోజిషన్ యూనివర్సెల్‌” లో అధికారికంగా యిది ప్రారంభించబడింది.

ఫ్రెంచ్ చరిత్రలో ఒక మలుపు అయిన ఫ్రెంచ్ విప్లవానికి గుర్తుగా మరియు జ్ఞాపకార్థం ఈ వరల్డ్ ఫెయిర్ ఏర్పాటు చేయబడింది.

అనేక ప్రతిపాదనలను (100 కంటే ఎక్కువ ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి) తర్వాత ఫ్రెంచ్ విప్లవానికి నివాళిగా ప్రదర్శన యొక్క ప్రవేశద్వారం వద్ద ఈఫిల్ టవర్‌ను నిర్మించడానికి ప్రముఖ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ గుస్టావ్ ఈఫిల్‌కు సెంటెనరీ కమిటీ ఆమోదం తెలిపింది.

వరల్డ్ ఫెయిర్ అంటే ఏమిటి?

వరల్డ్ ఫెయిర్ అంటే ప్రపంచంలోని అనేక దేశాలు పాల్గొనే ఎగ్జిబిషన్. ఇది పారిశ్రామిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు కళాత్మక విజయాల అంతర్జాతీయ ప్రదర్శన.

ఫ్రెంచ్ విప్లవం (The French Revolution ) (1789-99) అంటే ఏమిటి?

ఇది ఫ్రెంచ్ రాజ్యంలో అప్పట్లో నెలకొన్న భూస్వామ్య నిర్మాణాన్ని వ్యతిరేకించడానికై ఫ్రెంచ్ సమాజంలోని వివిధ సమూహాలచే ప్రారంభించబడింది. దీని ప్రధాన లక్ష్యం బోర్బన్ రాచరికం (1589 నుండి 1848 వరకు ఫ్రాన్సు యొక్క రాజరిక పాలక కుటుంబం) యొక్క అరాచక పాలనను అంతం చేయటం. మే 1789లో స్టేట్స్ జనరల్ (లెజిస్లేటివ్ అసెంబ్లీ) సభ్యులు సమావేశమై రాచరికానికి వ్యతిరేకంగా రాజకీయ మరియు సామాజిక విప్లవాన్ని ప్రారంభించారు.

ఐఫిల్ (ఈఫిల్) టవర్ 320 మీటర్ల (1051 అడుగులు) వరకు నిర్మించబడింది, ఇది ఆ రోజుల్లో అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణం. చాలా సంవత్సరాల పాటు అంటే 1889 నుండి 1930 వరకు ప్రపంచ ఎత్తైన టవర్ అనే ఘనత పొందింది.

నేడు ప్రపంచంలో ఈఫిల్ కంటే ఎత్తైన టవర్లు:

ఈఫిల్ టవర్ మించిన ఎత్తులో ఈరోజు 6 టవర్లు ((చెక్క లేదా లోహంతో తయారు చేయబడిన టవర్లు) ఉన్నాయి.

1. జపాన్‌లోని టోక్యోలో ఉన్న టోక్యో స్కైట్రీ ఇప్పుడు 643 మీ. (2,080 అడుగులు) ఎత్తుతో మొదటి స్థానంలో ఉంది. దీనిని 2011లో నిర్మించారు.

2. ఉక్రెయిన్‌లోని కైవ్ వద్ద కైవ్ టీవీ టవర్ – 1973లో నిర్మించబడింది. ఎత్తు – 385 మీ. (263 అడుగులు). 2022లో ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో రష్యా క్షిపణి ఈ టవర్ పై దాడి చేసింది.

3. చైనాలోని హర్బిన్ వద్ద డ్రాగన్ టవర్ – 2000లో నిర్మించబడింది. ఎత్తు – 336 మీ. (1102 అడుగులు).

4. జపాన్‌లోని టోక్యో వద్ద టోక్యో టవర్ – 1958లో నిర్మించబడింది. ఎత్తు – 333 మీ. (1093 అడుగులు).

5. USలోని విస్కాన్సిన్‌లోని షోర్‌వుడ్ వద్ద WITI TV టవర్ – 1962లో నిర్మించబడింది. ఎత్తు – 329.4 మీ. (1081 అడుగులు).

6. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ టీవీ టవర్ – 1962లో నిర్మించబడింది. ఎత్తు – 326 మీ. (1070 అడుగులు).

ఈఫిల్ టవర్‌ను గుస్తావ్ ఈఫిల్ ఎలా నిర్మించారు:

టవర్ 7,112 టన్నుల (రమారమి 7,000 టన్నుల పైబడి) బరువుతో 15,000 వెల్డింగ్ తో జత చేయబడిన ఇనుప ముక్కలతో ఇది నిర్మించబడింది.

ఐఫిల్ టవర్ యొక్క ప్రారంభ వేడుకలను వర్ణించాలంటే మాటలు చాలవు.

నిజంగా ఆనాటిని – 72 కిమీ (45 మైళ్ళు) దూరం వరకూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 30 మిలియన్ల మంది ప్రజలు 2,000 గ్యాస్ లైట్ల ద్వారా అద్భుతమైన వెలుగులను విరజిమ్ముతున్న ఆ టవర్‌ యొక్క లైటింగ్‌ను వీక్షిస్తూ ఆస్వాదిస్తున్న అపురూప దృశ్య మని చెప్పాలి.

గుస్టావ్ ఈఫిల్ (1832-1923), ఫ్రెంచ్ ఇంజనీర్:

అతను ఈ అద్భుతమైన టవర్‌ని డిజైన్ చేసి నిర్మించాడు. దానిని ప్రారంభించింది కూడా ఆయనే. స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క అంతర్గత (ఇనుప) నిర్మాణాన్ని కూడా ఆయనే రూపొందించారు. ఈ స్టాచ్యూ పారిస్‌లో తయారు చేయబడింది. ఆ తర్వాత అది న్యూయార్క్ కి తరలించబడింది. న్యూయార్క్ నగర నౌకాశ్రయానికి ప్రవేశ ద్వారంగా భావించే లిబర్టీ ద్వీపంలో ప్రతిష్టించ బడింది.

టవర్ శిఖరాగ్ర భాగాన గుస్తావ్ ఈఫిల్ త్రివర్ణ పతాకాన్ని నాటారు. అతను దానిని ఫ్రాన్స్ యొక్క అద్భుతమైన గతం మరియు భవిష్యత్తులకు గుర్తుగా అంకితం చేశాడు. శాస్త్రీయ మరియు పారిశ్రామిక అభివృద్ధికి కొత్త యుగానికి ఇది గొప్ప చిహ్నంగా ఆయన అభివర్ణించారు.

టవర్ మూడు స్థాయిలలో నిర్మించబడింది. పర్యాటకులు మెట్ల ద్వారా లేదా లిఫ్ట్ ద్వారా ఎక్కవచ్చు.

అతను తన కోసం మరియు తన అతిథుల కోసం తన ప్రయోగశాలలతో పాటు పైభాగంలో ఒక చిన్న అపార్ట్మెంట్ ను నిర్మించు కున్నాడు.

ఈఫిల్ టవర్ కి వ్యతిరేకంగా ఆ నాటి విమర్శకుల నిరసనలు:

చాలా మంది విమర్శకులు దీనిని పనికిరాని మరియు భయంకరమైన భూత నిర్మాణంగా అభివర్ణించారు. కళ్ళు తిరిగి క్రిందకు పడిపోతారని వారు సందర్శకులను హెచ్చరించారు. అంతేకాక పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని భయపెట్టారు. ఫ్రెంచి కళాకారుల యొక్క అగస్ట్ గ్రూప్ గా పిలువబడే బృందం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ నాడు నిరసనలు చేపట్టింది. కానీ అవేవీ ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని ఆపలేక పోయాయి.

ఈఫిల్ టవర్‌ను 1909లో కూల్చివేయాల్సిన మాట నిజమే.

ప్రారంభంలో ఈఫిల్‌కు 20 ఏళ్లపాటు అనుమతి లభించింది. కాబట్టి దీనిని 1909లో విడి భాగాలుగా విడదీయాల్సి ఉంది. కానీ రేడియో టెలిగ్రాఫీకి సంబంధించిన కొత్త విజ్ఞాన శాస్త్రానికి అవసరమైన యాంటెన్నాలకు దీని ఎత్తు చాలా బాగా ఉపయోగ పడుతుంది కాబట్టి దీన్ని కూల్చ లేదు. 1909 నాటికి దాని అనుమతి గడువు ముగిసిన తర్వాత కూడా ప్యారిస్ నగర పాలక సంస్థ టవర్ ను కొనసాగించే అనుమతిని మంజూరు చేసింది,  ఆ తర్వాత ఈ టవర్, ఇంటర్నేషనల్ టైమ్ సర్వీస్ (ITS)లో కూడా ఒక భాగమైంది.

పర్యాటక ఆకర్షణతో పాటు. ఇప్పుడు ఇది అబ్జర్వేషన్ మరియు బ్రాడ్‌కాస్టింగ్ టవర్‌గా పనిచేస్తున్నది.

1909 లో సౌత్ పిల్లర్ వద్ద శాశ్వత భూగర్భ రేడియో కేంద్రం ఏర్పాటు చేయబడింది. పారిస్ అబ్జర్వేటరీ మరియు U.S. నావల్ అబ్జర్వేటరీలు ఈఫిల్ టవర్‌ని తమ రేడియో మరియు డిజిటల్ టెలివిజన్ సిగ్నల్‌స్ కోసం ఉపయోగిస్తున్నాయి.

తదనంతర సంవత్సరాల్లో ఇది ఒక పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రసిద్ధ ఆకర్షణగా మారింది. దీనిని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 300 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారని అంచనా. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే టికెట్ కొని అత్యధికులు సందర్శించే స్మారక చిహ్నంగా చెప్పవచ్చు. ప్రతిరోజు సగటున 25,000 మంది సందర్శకులు టవర్‌ పైకి ఎక్కుతారని చెబుతారు.

1989లో టవర్ యొక్క 100-సంవత్సరాల వేడుకలు ఏంతో గొప్పగా జరిగాయి. ‘ఒరిజినల్ విజువల్ క్రియేషన్’గా కాపీరైట్ చేయబడిన ప్రత్యేక లైటింగ్ సిస్టమ్‌తో ఈ వేడుకలు నిర్వహించారు. 

ఐక్యరాజ్యసమితి యొక్క యునెస్కో 1964లో ఈ స్థలాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది, దీనికి ‘మాన్యుమెంట్ హిస్టారిక్’ అని పేరు పెట్టింది.

Presented by:

Leave a Reply