October 5 turned into October 15…!?!

అకస్మాత్తుగా 5వ తారీఖు 15వ తారీఖుగా ఎలా మారింది…!?!

రాత్రికి రాత్రే 10 రోజులు డ్రిఫ్టింగ్ (Drifting) అన్నమాట.

ఇది కల్పితం కాదు… నిజమే.

  • సమయం: అక్టోబర్ 4 వ తేదీ రాత్రి.
  • ప్రాంతం: ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ మరియు పోలాండ్ దేశాలు.

అందరూ నిద్ర దేవి ఒడిలో సేద తీరుతున్నారు.

మేల్కొని చూస్తే వారు అక్టోబర్ 15 వ తేదీ లో వున్నారు.  

వారు 10 రోజులు ముందుకొచ్చేశారు?

అసలు విషయ మేంటంటే…

క్రీస్తు శకం 1582 అక్టోబర్ 5 వ తేదీన క్యాలెండర్‌ని మార్పు చేయడంతో యిలా జరిగింది.

ఆ రోజున క్రొత్తగా గ్రెగోరియన్ క్యాలెండర్ అమలులోకోచ్చింది.

దానిని 13 వ పోప్ గ్రెగొరీ రీసెట్ చేసారు.

పైన పేర్కొన్న నాలుగు దేశాలు క్రీ.శ. 1582 లో కాథలిక్ యూరప్‌కు చెందినవి.

పోప్ ప్రకటించిన కొత్త క్యాలెండర్లో రాత్రికి రాత్రి పది రోజులు తొలగించబడ్డాయి.

మొదటగా ఐరోపాలోని కాథలిక్ దేశాలలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఆమోదించబడింది. కాల క్రమేణ ప్రపంచంలోని చాలా దేశాల్లో దీనిని నేడు అనుసరిస్తున్నారు.

క్రీ.శ. 1582 వరకు కాథలిక్ దేశాలు జూలియన్ క్యాలెండర్ ను అనుసరించే వారు.

ఈ జూలియన్ క్యాలెండర్ అనేది క్రీస్తు పూర్వం 46 లో రోమన్ క్యాలెండర్‌ను సంస్కరించడం ద్వారా జూలియస్ సీజర్ అమలు లోకి తీసుకువచ్చాడు.

ఈ జూలియన్ క్యాలెండర్ క్రీ.శ. 1582 వరకు అనుసరించబడింది.

  • జూలియన్ క్యాలెండర్ ను 13వ పోప్ గ్రెగొరీ ఎందుకు రీసెట్ చేశారు?

జూలియన్ క్యాలెండర్ యొక్క సంస్కరణకు ప్రధాన కారణం ఈస్టర్ తేదీని సరిచేయడం.  

కారణం:

ఈస్టర్ అనేది క్రిస్టియన్లకు అత్యంత ముఖ్యమైన పండుగ. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థాపనకు ముందు క్రీస్తు శకం 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా తీర్మానం (the Council of Nicaea) ప్రకారం వసంత విషువత్తు (the spring equinox లేదా vernal equinox)  తర్వాత పౌర్ణమికి దగ్గరగా ఉన్న ఆదివారం నాడు ఈస్టర్‌ను అనుసరించేవారు.

విషువత్తులు (Equinox) అంటే ఏమిటి?

విషువత్తులు (Equinox) అంటే ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలలో పగలు మరియు రాత్రి సమయాలు దాదాపు సమానంగా వుంటాయి.  ఈ విశువత్తులు సంవత్సరంలో రెండు సార్లు సంభవిస్తాయి.

ఒకటి – వసంత విషువత్తు (the spring equinox లేదా vernal equinox or March equinox). ఇది దాదాపుగా మార్చి నెల 21 న సంభవిస్తుంది.

రెండు – “శరదృతు విషువత్తు” (శిశిర విషువత్తు) (autumnal equinox or fall equinox or September equinox). ఇది దాదాపుగా సెప్టెంబర్ నెల 22 న సంభవిస్తుంది.

జూలియన్ క్యాలెండర్‌లో సమయ లోపం ఉంది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం సౌర సంవత్సరం అనేది 365.25 రోజులు.

కానీ ఖచ్చితంగా చెప్పాలంటే, అసలు సౌర సంవత్సరం 365.2422 రోజులు. ఈ సమయ లోపం వలన ప్రతి 100 సంవత్సరాలకు ఒక రోజు అదనంగా చేరుతూ వస్తున్నది. కానీ క్యాలెండర్లో దీని సర్దుబాటు జరగ లేదు.

దానివలన ఈస్తర్ పండుగ యొక్క సరైన రోజును నిర్ధారించటం జరగటం లేదు.

కాబట్టి 13 వ పోప్ గ్రెగొరీ ఈ సమస్యను పరిష్కరించాడు. జూలియన్ క్యాలెండర్‌లో ఈ తప్పుడు గణనను సర్దుబాటు చేయడానికి అతను 1582 లో పది రోజులు డ్రాప్ చేయాలని ప్రతిపాదించాడు.

ఆ విధంగా అక్టోబర్ 5 తేదీ అకస్మాత్తుగా అక్టోబర్ 15 గా మారింది.

పోప్ గ్రెగరీ చేసిన మార్పు వల్ల లీపు సంవత్సరం యొక్క ఖచ్చితమైన కొలమానం కూడా నిర్ణయించ బడింది. అదేంటంటే 400 తో భాగిస్తే తప్ప ఏ శతాబ్ద సంవత్సరం కూడా లీపు సంవత్సరంగా ఉండకూడదని సర్దుబాటు చేసింది. ఆ విధంగా ఖచ్చితమైన కొలమానంతో లీపు సంవత్సరం ఏర్పడింది.

ఇదన్న మాట అక్టోబర్ 5 తేదీ రాత్రికి రాత్రే అకస్మాత్తుగా అక్టోబర్ 15 గా మారటం వెనుక వున్న అసలు కథ ఇది.

Presented by:

Leave a Reply