చైనా మొట్ట మొదటి చక్రవర్తి – ఎన్నో అద్భుతాల సృష్టికర్త
చరిత్ర మరువలేని ఎన్నో అధ్బుతాల సృష్టికర్త – చైనా మొట్ట మొదటి చక్రవర్తి.
నేడు గొప్పగా ప్రపంచంచే కొనియాడ బడుతున్న చైనా యొక్క గొప్ప కట్టడాలు దాని మొట్ట మొదటి చక్రవర్తి సృష్టించినవే.
చైనా మొట్ట మొదటి చక్రవర్తి ఇంగ్ జెంగ్ (Ying Zheng) అనేక నమ్మశక్యం కాని పనులు చేశాడు.
వాటిలో ప్రధాన మైనవి –
సరిహద్దులోని కోటల ప్రాంతీయ గోడలను కలపటం ద్వారా ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణానికి పూనుకోవడం.
హాలీవుడ్ ఫిల్మ్ – ‘ది మమ్మీ, టూమ్బ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్’లో చూపిన విధంగా 7,000 సైనికుల టెర్రకోట ఆర్మీను తన సమాధిని కాపలా కాసేలా గొప్ప సమాధి కాంప్లెక్స్ ను డిజైన్ చేయడం.
![](/wp-content/uploads/2023/02/002_web-1.webp)
చైనా చరిత్రలో జెంగ్ యొక్క ప్రాముఖ్యత:
చరిత్రలో మొట్ట మొదటిసారిగా క్రీ.పూ. 221 లో చక్రవర్తి జెంగ్ సువిశాల యునైటెడ్ చైనాను స్థాపించాడు.
అందువలననే అతను చైనా యొక్క “మొట్ట మొదటి చక్రవర్తి” అని పిలువబడ్డాడు.
అతని పాలనకు ముందు, చైనా వివిధ స్థానిక రాజుల క్రింద ఏడు రాజ్యాలు (ప్రావిన్సులు) గా విభజించబడి వుండేది.
ఆ సమయంలో ప్రాంతీయ రాజులందరూ ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు.
ఈ కాలాన్ని “వారింగ్ స్టేట్స్ పీరియడ్ (రాజ్యాల మధ్య అంతర్యుద్ద కాలం)” అని పిలుస్తారు. ఆ యుద్దాలు సుమారు 200 సంవత్సరాల పాటు కొనసాగాయి.
చైనాకు పశ్చిమాన ఉన్న క్విన్ (Qin) అనేది ఆ ఏడు ప్రావిన్సులలో ఒకటి.
ఆ యుద్ద సమయంలో క్రీ. పూ. 246 వ సంవత్సరంలో జెంగ్ తన 13 సంవత్సరాల చిన్న వయస్సులోనే క్విన్ రాజ్యానికి అధిపతి అయ్యాడు.
తదనంతర కాలంలో జెంగ్ ఇతర ప్రత్యర్థి రాజులలో అత్యంత శక్తివంతుడిగా ఆవిర్భవించాడు.
![](/wp-content/uploads/2023/02/003_web-1.webp)
దాదాపు క్రీ.పూ. 238 లో తన యుక్తవయస్సులో అతను చైనాను ఏక పాలనలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం ఇతర ప్రత్యర్థి రాజులను ఓడించేందుకు కొత్త వ్యూహాలను రచించాడు.
గెరిల్లా-రకం దాడులు మరియు ఇతర ఆశ్చర్యకరమైన వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాడు.
తన ప్రత్యర్థులను మట్టి కరిపించడానికి తెలివైన గూఢచర్య పద్ధతులను ప్రవేశపెట్టాడు.
ప్రత్యర్థి రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులకు లంచాలు యిచ్చి లోబరచుకున్నాడు.
అతను క్రీ. పూ. 221 నాటికి మిగిలిన ఆరు ప్రావిన్స్‌లలోని ప్రత్యర్థి రాజులందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఓడించాడు.
ఆ విధంగా అతను “షి హువాంగ్డి” (Shi Huangdi) అంటే “మొట్ట మొదటి చక్రవర్తి” అనే బిరుదును పొందాడు.
తన రాజవంశం “పది వేల తరాల” పాటు చైనాను పరిపాలిస్తుంది – అని అతను స్వయంగా ప్రకటించాడు.
అతను మరియు అతని ప్రధాన మంత్రి అయిన లి సి (Li Si) కలసి మొత్తం చైనాను తమ పూర్తి నియంత్రణలో ఉంచుకోవడానికి నిరంకుశమైన కేంద్రీకృత పాలన కొనసాగించారు.
![](/wp-content/uploads/2023/02/004_web-1.webp)
చక్రవర్తిగా జెంగ్ యొక్క విశిష్ట విజయాలు:
1. అప్పటి ప్రాంతీయ వైవిధ్యాలను అధిగమిస్తూ దేశవ్యాప్తంగా తూనికలు మరియు కొలతల యొక్క ప్రామాణిక వ్యవస్థను అమలు చేశాడు.
2. ఎన్నో ప్రామాణిక చట్టాలను తయారు చేశాడు.
3. చైనా భాష లిపిని ప్రామాణిక రూపంలోకి మార్చాడు.
4. దేశం అంతటా రోడ్లు మరియు కాలువలు నిర్మించాడు.
5. శత్రువుల దాడులను నిర్వీర్యం చేసేందుకు సరిహద్దులను బలోపేతం చేశాడు.
6. మరీ ముఖ్యంగా, అతను ఉత్తరాన ఉన్న సరిహద్దు కోట దుర్గాలను కలుపుతూ ప్రపంచ వింతలలో ఒకటైన ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణాన్ని ప్రారంభించాడు.
7. తన సమాధి రక్షణ కోసం ఆయన ఒక పెద్ద కాంప్లెక్స్ ను నిర్మించాడు. దీని కోసం 700,000 మంది కార్మికులు పనిచేశారు. ఆ సమాధి యొక్క సముదాయం 7,000 మంది కంటే ఎక్కువ సంఖ్యలో అచ్చం మానవ ఆకార పరిమాణాలను పోలిన బంకమట్టితో చేసిన యోధులతో కూడిన ఒక పెద్ద టెర్రకోట సైన్యం తన సమాధిని రక్షించే విధంగా తయారు చేయించు కున్నాడు.
ఈ భారీ సమాధి సముదాయం 1974లో ఒక బావిని తవ్వుతున్నప్పుడు కనుగొనబడింది.
ఆ విధంగా చైనా యొక్క మొదటి చక్రవర్తి, జెంగ్ చైనాకు గొప్ప అద్భుతాలను అందించాడు – చైనా యొక్క గ్రేట్ వాల్ నిర్మాణం, నమ్మశక్యం కాని గొప్ప టెర్రకోట సైన్యం.
ఈ సైన్యమే అతని సమాధిని 2000 సంవత్సరాలకు పైగా కాపాడిందని ఒక నమ్మకం.
![](/wp-content/uploads/2023/02/005_2_web.webp)
చైనా మొదటి చక్రవర్తి గురించి మరొక ఆసక్తికరమైన విషయం:
- ఆధ్యాత్మిక అతీంద్రియ విశ్వాసాలు:
- అమరత్వం కోసం అన్వేషణ:
జెంగ్ చక్రవర్తికి విశ్వ సృష్టి (Cosmic World) గురించి కొన్ని ఆధ్యాత్మిక అతీంద్రియ నమ్మకాలు ఉన్నాయి.
అలాగే ఆయన తన మరణాన్ని తప్పించుకోవడానికై అమృతం కోసం వెతికాడు.
అమృతాన్ని సాధించాలనే లక్షంతో జపాన్‌కు వెళ్లాడని కూడా చెబుతారు.